ఆయన కోరికలు నెరవేరుస్తానంటున్న బాలయ్య

Update: 2018-01-26 10:02 GMT

స్వర్గీయ నందమూరి తారకరామారావు చలన చిత్ర రంగంలో కథానాయకుడు ఐన నాటి నుంచి ఎన్నో మరపురాని పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయ్యారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలని పోషించేవారు ఆయన. అయితే ఆయన చేయదలచి రప్పించుకున్న పాత్రలు, మోజుపడి ప్రకటించిన పాత్రలు కూడా కొన్ని వెండితెరపైకి ఆయన రూపంలో రాకుండానే అనివార్య కారణాల వలన నిలిచిపోయాయి. రామారావు చేయాలనుకున్న అల్లూరి సీతారామరాజు వంటి సమరయోధుడి పాత్ర ఆయన చేసేలోపే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి విజయం పొందిన సంగతి అందరికి జ్ఞాపకమే.

తన తండ్రి ఆశపడి చేయలేని పాత్రలు అన్ని తనకి గుర్తు ఉన్నాయని, ఒక్కొక్కటిగా ఆ పాత్రలన్నీ పోషించి ఆయన కోరిక నెరవేరుస్తానని చెప్తున్నారు నట సింహం నందమూరి బాల కృష్ణ. గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రని కూడా రామారావు చేయాలనుకుని చేయలేకపోయారని, తన 100 వ చిత్రంగా ఆ పాత్ర పోషించటం తనకి గర్వంగా ఉంటుందని చెప్పిన బాలయ్య తన తండ్రి కోరుకుని చేయలేని మరి కొన్ని పాత్రలలో అల్లూరి సీతారామరాజు, రామానుజాచార్య తదితర పాత్రలు ఉన్నాయని, త్వరలోనే ఒక్కొక్కటిగా ఆ పాత్రలలో ప్రేక్షకులని మెప్పిస్తానని చెప్తున్నారు బాలయ్య.

Similar News