ఆడియో రైట్స్ కూడా భారీగానే

Update: 2017-11-05 14:00 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25 వ చిత్రం అజ్ఞాతవాసి పై అభిమానులుకు ఏస్థాయిలో ఆశలు పెట్టుకుని ఉన్నారో అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉండడంతో ఫస్ట్ లుక్, టీజర్ తదితర చిత్ర విశేషాల కోసం పవన్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అజ్ఞాతవాసి టైటిల్ లోగో మరియు, ఫస్ట్ లుక్ త్రివిక్రమ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తారనే టాక్ వుంది. ఇక ఈ చిత్రానికి తెలుగులో తొలిసారి సంగీత సంచలనం అనిరుద్ రవి చంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మొన్నామద్యన పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘బైటికొచ్చి చూస్తే టైమేమో’ అనే బిట్ సాంగ్ అభిమానులకు వెంటనే నచ్చేసింది. దీనితో అనిరుద్ అందించబోయే పాటలపై కూడా భారీ అంచనాలు వచ్చేశాయ్.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అజ్ఞాతవాసి మ్యూజిక్ కి అంచనాలకు తగ్గట్లుగానే ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ భారీ మొత్తానికి ఈ చిత్ర ఆడియో హక్కులని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ధరకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు కానీ... ఫ్యాన్సీ ధరకు ఆడియో హక్కులు అమ్ముడైనట్లు మాత్రం సమాచారం. ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ తో పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ నుంచి ఆడియో రిలీజ్ వంటి ప్రమోషన్ కార్యక్రమాలని చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టనుంది. జనవరి ౧౦ న సినిమా విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన ఉండనే ఉంది.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి, ఖుష్బూ, ఇంద్రజ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనబడనున్నారు.

Similar News