ఆ స్టార్స్ ని బ్యాన్ చేస్తారా?

Update: 2017-11-18 11:00 GMT

తమిళనాట ఒక ముగ్గురు నటీనటులను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. ఇప్పటికే ఆ నటీనటులకు నిర్మాతల మండలి నుండి నోటీసులు జారీ అయినట్టుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే వారిపై దాదాపు రెండేళ్లపాటు నిషేధం విధించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ నటీనటులు ఎవరనేగా? అదేనండి తెలుగు, తమిళంలో ను హీరోయిన్ గా చక్రం తిప్పిన త్రిష తోపాటు తమిళంలో ఒకప్పుడు హీరోగా ఒకవెలుగు వెలిగిన శింబు, తమిళ హాస్య నటుడు వడివేలు. వీరిముగ్గురికి నిర్మాతలమండలి నుండి నోటీసు లు వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ వారిని ఎందుకు ఇండస్ట్రీ నుండి నిషేదిస్తున్నారో తెలుసుకోవాలనుందా.. అయితే పదండి మేటర్ లోకి..

శింభుకు నోటీసులు...

తమిళ దర్శకనిర్మాత టి రాజేందర్ కొడుకు శింబు... ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ ఈ మధ్యన హీరోగా ఫామ్ కోల్పోయిన శింబు పై ‘అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌’ సినిమాకి సంబంధించి ఆ సినిమా జిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ ఫిర్యాదు చేసినట్లు టాక్. విషయంలోకెళితే.... ‘అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌’ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలన్నది హీరో శింబు వాదన. అయితే ‘అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌’ నిర్మాత మాత్రం ఈ చిత్రాన్ని ఒక్క భాగంతోనే సరిపెట్టాలనుకున్నాడట. అందులో భాగంగానే... ఆ సినిమా ని కేవలం 29 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేసిందట చిత్ర యూనిట్. అయితే శింబు మాత్రం తాను నటించిన సన్నివేశాలతోనే... సినిమాని విడుదల చేయాలని కండిషన్ పెట్టాడట. అయితే ఈ సినిమా హీరో శింబు వ్యవహారశైలి వల్ల తనకు 18 కోట్ల వరకు నష్టం వచ్చిందని రాయప్పన్‌ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడట. ఈవిషయమై నిర్మాత మండలి శింబుకు నోటీసులు ఇచ్చారట.

ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో....

ఇక హీరోయిన్ త్రిష విషయానికొస్తే.. హరి - విక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సామి 2 లో మొదటగా త్రిషని హీరోయిన్ గా తీసుకున్నారట. సినిమా మొదలెట్టిన తర్వాత త్రిష ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈ విషయమై త్రిషని వివరణ కోరగా.. వ్యక్తిగత కారణాలతోనే ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా చెప్పిందట. కానీ ఆమె అలా చెప్పినప్పటికీ... ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి సడన్ గా తప్పుకోవడంతో తమకు తీవ్రనష్టం వాటిల్లిందంటూ ఆ చిత్ర నిర్మాత.. నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడట.

వడివేలు కూడా...

ఇకపోతే హాస్య నటుడు వడివేలు హీరోగా శంకర్‌ నిర్మాణంలో ‘24 ఎం పులికేసి’ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే చిత్ర బృందం మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ విభేదాలతో వడివేలు సినిమా షూటింగ్ కి రాలేదట. అప్పటికే ఆ సినిమా షూటింగ్ కోసం ఖరీదైన సెట్ నిర్మించారు. ఈ సెట్ నిర్మాణం జరిగినాక... సినిమా ఆగిపోవడంతో దాదాపు నాలుగైదు కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడంతో వాడివేలుకి కూడా నోటీసులు ఇచ్చారట. అయితే వీరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తమిళ నిర్మాత జ్నావెల్ రాజా ఒక తమిళ ఆడియో వేడుకలో చెప్పారు. అంటే ఖచ్చితంగా వీరి నిషేధం ఉంటుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Similar News