అసలు లాసే రాదు!

Update: 2017-10-11 12:00 GMT

శంకర్ - రజినీకాంత్ కలయికలో తెరకెక్కిన చిత్రం రోబో 2.0 . దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పెట్టి మరి తీస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఏది కదిపినా కోట్లతో ఉండే వ్యవహారమే. లైకా ప్రొడక్షన్ వారు కూడా కళ్ళు మూసుకుని 2.0 కి పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చేసారు. అయితే లైకా ప్రొడక్షన్స్ వారు 2.0 కి 400 కోట్ల పై మేర బడ్జెట్ పెట్టినప్పటికీ వారికేమి లాస్ రాదులెండి. ఎందుకంటే 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ లేవల్లోనే వుంది. నిర్మాతలకు బోలెడు లాభాలు తెచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. గత రెండేళ్లుగా 2.0 ని చెక్కుతున్న శంకర్ ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరులో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న చిత్ర బృందం మరోవైపు 2.0 పబ్లిసిటీ కార్యక్రమాల పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.

2.0 సినిమా కోసం చెన్నై శివార్లలోని ఒక్క పార్క్ లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 2.0 షూటింగ్ ఎక్కువ శాతం అందులోనే చేశారు. ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియోలో చూపించిన చాలా సన్నివేశాలు ఆ సెట్ లోనివే. అయితే 2.0 సినిమా విడుదల తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ సెట్ ను అలానే ఉంచబోతున్నారు. ఇక 2.0 షూటింగ్ చివరి షెడ్యూల్ లో భాగంగా మిగిలిన ఒక్క పాటను మరో నాలు రోజుల పాటు షూట్ చెయ్యబోతున్నారు. రజనీకాంత్, ఎమీ జాక్సన్ మధ్య తెరకెక్కించనున్న ఈ సాంగ్ తో 2.0 షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది.

ఇకపోతే 2.0 సినిమా బిజినెస్ ఇప్పటికే అదిరిపోయే లెవల్లో జరిగింది. తెలుగులోనే 80 కోట్లకు పైగా తెలుగు రైట్స్ అమ్ముడు పోగా శాటిలైట్స్ హక్కులే 170 కోట్ల మేర అమ్ముడుపోయినట్లుగా చెబుతున్నారు. మరి మేకర్స్ 450 కోట్ల బడ్జెట్ పెడితేనేమి దానికి రెండింతల బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇకపోతే ఈ నెలాఖరులో దుబాయ్ లో 2.0 ఆడియో వేడుకని 12 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తుండగా... వచ్చే నెల అంటే నవంబర్ నెలాఖరున తెలుగులో 2.0 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది చిత్ర బృందం.

Similar News