ఒకసారి సుడి అనేది గనక తిరిగింది అంటే దానిని ఎవరూ ఆపలేరు అనే సత్యాన్ని 'అర్జున్ రెడ్డి' చిత్రం వారం వారం నిరూపిస్తూనే వుంది. 4.5 కోట్ల బడ్జెట్ తో చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ 'అర్జున్ రెడ్డి' చిత్రం ఇప్పటికే 23 కోట్ల కలెక్షన్స్ తో దున్నేస్తుంది. సినిమాకి విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీతో ఏ సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా పూర్తి నెగెటివ్ పబ్లిసిటీని మూటగట్టుకు ఆగష్టు 25 న విడుదలైంది. ఆ వారం అర్జున్ రెడ్డితో పాటొచ్చిన అజిత్ 'వివేకం', ధనుష్ 'విఐపి 2 ' సినిమాలని ప్రేక్షకులు తిరస్కరించి 'అర్జున్ రెడ్డి' కి పట్టం కట్టారు.
ఇక ఆతర్వాతి శుక్రవారం సెప్టెంబర్ 1 న బాలకృష్ణ - పూరి ల క్రేజీ కాంబో 'పైసా వసూల్' వచ్చింది. ఆ సినిమా కూడా నెగెటివ్ టాక్ తో 'అర్జున్ రెడ్డి 'చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ దారిచ్చింది. రెండు వారాలకు 'అర్జున్ రెడ్డి' అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక మూడో శుక్రవారం అంటే సెప్టెంబర్ 8 న విడుదలైన నాగ చైతన్య 'యుద్ధం శరణం', అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' చిత్రాలు కూడా చేతులెత్తేసే పరిస్థితి కనబడుతుంది. ఆ రెండు సినిమాలకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో మళ్ళీ 'అర్జున్ రెడ్డి'కి కలిసొచ్చింది. 'అర్జున్ రెడ్డి' కలెక్షన్ కి ఏ ఢోకా లేదని తేలిపోయింది.
ఇక నాలుగో వారం అంటే సెప్టెంబర్ 15 న విడుదల కాబోతున్న సచిన్ జోషి 'వీడెవడు', సునీల్ హీరోగా వస్తున 'ఉంగరాల రాంబాబు'కి పెద్దగా క్రేజ్ లేదు. సచిన్ జోషి సినిమాలెలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఇక సునీల్ 'ఉంగరాల రాంబాబు' విడుదల కష్టాలను దాటి ఎట్టకేలకు విడుదలవుతుంది. మరి ఈ రెండు చిత్రాలలో కూడా 'అర్జున్ రెడ్డి'ని తట్టుకుని నిలబడే దమ్ము కనబడ్డం లేదు. మరి ఈ వారం కూడా 'అర్జున్ రెడ్డి' కలెక్షన్స్ కుమ్ముకునే అవకాశం బాగా కనబడుతుంది. ఇక 'అర్జున్ రెడ్డి' కి అడ్డు కట్ట వెయ్యాలి అంటే ఈ నెల 21 న 'జై లవ కుశ' వల్లే అవుతుంది అంటున్నారు. అంటే 'జై లవ కుశ' థియేటర్స్ లోకి దిగే వరకు 'అర్జున్ రెడ్డి'కి ఎదురే లేదన్నమాట. ఇదండీ 'అర్జున్ రెడ్డి' సుడి అంటే.