తెలుగులో అర్జున్ రెడ్డి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. విజయ్ దేవరకొండ - షాలిని పాండే హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన ఈచిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో వల్గారిటీ ఎక్కువ ఉందంటూ ఈ చిత్రానికి కావాల్సిన నెగెటివ్ పబ్లిసిటీ చేసినా ఈ చిత్ర కలెక్షన్స్ పై ఆప్రభావమే పడలేదు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా అట్రాక్ట్ చేసింది. ఇక ఇక్కడ తెలుగులో ఇరగదీసిన ఈ చిత్రానికి తమిళ, హిందీ, మలయాళ రీమేక్ రైట్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అర్జున్ రెడ్డి చిత్ర తమిళ హక్కులను కోలీవుడ్ హీరో, దర్శకుడు, నిర్మాత అయినా ధనుష్ దాదాపు 80 లక్షలకు దక్కించుకున్నాడని.. ఆయనే హీరోగా ఈసినిమా చేస్తాడో... లేకుంటే వేరే హీరోతో ఈ అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తాడో అంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి తమిళ హక్కులను ధనుష్ తీసుకోలేదని అంటున్నారు. ధనుష్ చెందిన వండర్ బార్ ఫిల్మ్స్ కూడా అర్జున్ రెడ్డి రైట్స్ కొనుగోలుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదని... ఇప్పుడు తాజాగా ఈ4 ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థ అర్జున్ రెడ్డి సినిమా హక్కులను తీసుకుందంటున్నారు.
అయితే ఈ4 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కేవలం తమిళ హక్కులనే కాకుండా మలయాళ హక్కులను కూడా హోల్సేల్ గా కొనేసినట్లుగా చెబుతున్నారు. ఆ సంస్థ తమిళ, మలయాళ హక్కులను తీసుకోగానే తమిళనాడు, కేరళల్లో తెలుగు వెర్షన్ అర్జున్ రెడ్డి ప్రదర్శనను కూడా నిలిపివేయించినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే తెలుగు వెర్షన్ థియేటర్లలో నడుస్తుంటే.. రీమేక్ వెర్షన్ పై ఉన్న ఆసక్తి ఏమైనా తగ్గుతుందేమో అనే భయంతో.. తమిళనాడు, కేరళ థియేటర్లలో అర్జున్ రెడ్డి ప్రదర్శనను నిలిపివేయించేసిందట ఈ సంస్థ. మరి ఈ సంస్థ బ్యానర్ లో తెరకెక్కనున్న అర్జున్ రెడ్డి తమిళ, మలయాళ రీమేక్ లో హీరోలుగా ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది..