గత ఏడాది చేతిలో అవకాశం లేక గోళ్లు గిలుకుంటూ కూర్చున్న కాజల్ ని చూసిన అందరూ ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా కాజల్ పని అయిపొయింది అనుకున్నారు. కానీ కాజల్ కి కాలం కలిసొచ్చి రామ్ చరణ్ తన తండ్రి హీరోగా తెరకెక్కిన' ఖైదీ నెంబర్ 150 ' సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో అమ్మడు మళ్ళీ ఒక్కసారిగా బిజీ అయ్యింది. ఆ వెంటనే రానా తో 'నేనే రాజు నేనే మంత్రి' చేసి హిట్ కొట్టింది. అలాగే తమిళంలో అజిత్ సరసన 'వివేగం'... విజయ సరసన 'మెర్సల్' లో నటించింది. అజిత్ 'వివేగం' ప్లాపవ్వగా... విజయ్ 'మెర్సల్' నిన్న బుధవారమే విడుదలై తమిళంలో పర్వాలేదనిపించింది.
ఇక 'మెర్సల్' ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కెరీర్ లో బెస్ట్ మూవీ అజిత్ సరసన తమిళంలో నటించిన 'వివేగం' అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. మరి ఆ సినిమా తమిళంలో ఎంత పెద్ద ప్లాపో తెలిసిందే. మరి కాజల్ కెరీర్ లో ఎన్నో బెస్ట్ మూవీస్ ఉన్నా... ఇలా 'వివేగం' పేరెందుకు చెప్పిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు 'వివేగం' సినిమాలో కాజల్ రోల్ కి ఎటువంటి ప్రత్యేకత ఉండదు. అయినా బెస్ట్ 'వివేగం' అనిచెప్పింది. అలాగే తెలుగులో తన బెస్ట్ మూవీస్ గురించి మట్లాడిన కాజల్ ఇక్కడా షాకిచ్చింది. తెలుగులో తన బెస్ట్ మూవీస్ గా.. 'మిస్టర్ పెర్ఫెక్ట్, బాద్ షా, నేనేరాజు నేనేమంత్రి' అని మాత్రమే చెప్పి మిగతావి వదిలేసింది.
మరి కాజల్ అగర్వాల్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ రామ్ చరణ్ తో కలిసి నటించిన 'మగధీర'. ఆ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసింది. ఆ చిత్రంలో కాజల్ నటన అద్భుతమంటారు. మరి అలాంటి సినిమాని మర్చిపోయిందా.. లేకుంటే కావాలనే అలా చెప్పిందో.... మాత్రం ఇప్పుడు కాజల్ చెప్పిన ఆ ముచ్చట్లు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.