బాలకృష్ణ కుర్ర హీరోలతో సమానంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హుషారుగా వున్నాడు. చేస్తున్న సినిమాలను ఆరు నెలల్లో ఫినిష్ చేస్తూ అభిమానులకు బూస్ట్ నిస్తున్నాడు. అందులోను 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి దగ్గరనుండి కొత్త కథలకే ప్రాధాన్యత ఇస్తానని కూడా ప్రకటించాడు. అప్పుడు చెప్పినట్టుగానే ఎవరూ ఎక్సపెక్ట్ చెయ్యని డైరెక్షన్ లో 101 వ సినిమా మొదలెట్టేసి అప్పుడే విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అస్సలు ఎవరు అనుకోలేదు పూరి జగన్నాధ్ తో బాలయ్య సినిమా చేస్తాడని. కానీ పూరి తో పైసా వసూల్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళడమూ అది కాస్త విడుదలకు సిద్ధం చెయ్యడము జరిగిపోయింది.
ఇక ఇప్పుడు 102 వ చిత్రం కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ కూడా కొత్తదే కావడం... చూస్తుంటే బాలకృష్ణ చెప్పినట్టుగానే కొత్తగా ట్రై చేస్తున్నాడన్నది మాత్రం నిజమే అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ అన్నిరకాలుగా.... కథ అన్ని సెట్ అయితే గనక తాను తన స్నేహితులు చిరంజీవి, వెంకటేష్ తో కలిసి నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతున్నాడు. కేవలం ఉత్త ప్రకటనతోనే ఊరుకోకుండా తన 105 వ చిత్రం ఒక భారీ మల్టి స్టారర్ గా వుండబోతుందనేది మాత్రం క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటికే కొత్త కొత్త కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్న బాలకృష్ణ ఇప్పుడు భారీ మల్టి స్టారర్ లో నటిస్తానని చెప్పడం చూస్తుంటే నిజంగానే ఆ మల్టీస్టారర్ పట్టాలెక్కితే ఆ సినిమాకి ఎలాంటి క్రేజ్ వస్తుందో అనేది ఊహించడానికి కూడా అందదు. అయితే బాలకృష్ణ తన 103 , 104 చిత్రాలపై క్లారిటీ ఇవ్వకుండా ఇలా 105 వ చిత్రం మల్టీస్టారర్ గా వుండబోతుందంటూ హింట్ ఇవ్వడం చూస్తుంటే.... ఖచ్చితం గా 103 , 104 సినిమాల కథలను కూడా లైన్ లో పెట్టేసాడనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. కాకపోతే 103 , 104 లలో ఒక చిత్రం మాత్రం ఎన్టీఆర్ బయో పిక్ ఉండచ్చనే ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి..