అన్ని విషయాలను టచ్ చేస్తానంటున్నాడు!!

Update: 2017-09-27 11:00 GMT

ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి కాంట్రవర్సీని సృష్టించడమంటే పిచ్చి. అందుకే నిత్యం వార్తల్లో నానుతుంటాడు. ఏదో ఒక విషయమై ట్వీట్స్ చేస్తూ రచ్చ చేసే వర్మ ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ జీవితంలో రెండో భార్యగా ప్రవేశించిన లక్ష్మి పార్వతి గురించి, ఆమె ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాల మీద సినిమా చేస్తానంటూ బయలుదేరాడు. ఆ సినిమా టైటిల్ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ గా వుండబోతుందంటూ ప్రకటించడమే కాదు ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా వదిలి అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటే ఒక పోస్ట్ కూడా పెట్టాడు.

సినిమాలో ఏంచూపుతారంటే?

అదేమిటంటే ఒక్క అడుగు ఒక మనిషి మనసులో ప్రేమను పుట్టిస్తే.. అదే ఒక్క అడుగు వందల మంది మనసులో ద్వేషాన్ని నింపింది.. కానీ ఆ ఒక్క అడుగే ఆయన్ను మళ్లీ మిలియన్ల మంది మనసుల్లో స్థానం పొందేందుకు ప్రేరణ నిచ్చింది. ఇదే విషయాన్ని తానూ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసాడు. అంతేకాదు ఆయన ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత అయన కుటుంబంలో ఏర్పడిన రాగ ద్వేషాలు, రాజకీయాల్లో వెన్నుపోటు పొడవడం దగ్గరనుండి ఆయన చనిపోయే వరకు జరిగిన పరిస్థితులన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెబుతున్నాడు. ఎప్పుడూ పోస్టర్స్ తయారుచేసి సినిమా చేస్తున్నాను అంటూ హడావిడి చేసి కొద్దిరోజుల తర్వాత సైలెంటయ్యే వర్మ ఈసారి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో చాలా క్లారిటీగా, వేడి మీదున్నాడు. ఆవేడి చల్లారకముందే సినిమాని మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరికల్లా సినిమాను విడుదల చేస్తానని ప్రకటించాడు. అలాగే నటీనటుల వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తానని చెబుతున్నాడు .

Similar News