ఎన్టీఆర్ అభిమానులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీఆర్ - బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న 'జై లవ కుశ' మీద ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం, ఒకే సినిమాలో మూడు పాత్రలతో సందడి చెయ్యడం వంటి విషయాలతో సినిమాపై ఆసక్తే కాదు అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. మరి రావణాసురుడి భక్తుడిగా 'జై' పాత్రలో ఎన్టీఆర్ జీన్స్ వేసుకుకొని హంగామా చేస్తున్నాడు. టీజర్ లోనే ఎన్టీఆర్ విలనిజం ఒకింత పరిచయం చేసాడు డైరెక్టర్ బాబీ.
ఇక 'జై' పాత్ర పొలిటికల్ గా స్ట్రాంగ్ అని.... జై ఈ సినిమాలో సమ సమాజ్ పార్టీని స్థాపించి.. ఆ పార్టీ కోసమే ప్రచారం చేసే కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మరి స్వతహాగా ఎన్టీఆర్ కి సినిమాల్లో పాలిటిక్స్ అచ్చిరావనే డౌట్ క్రియేట్ అవుతుంది అభిమానుల్లో. ఎందుకంటే ఎన్టీఆర్ ఇదివరకు సినిమాల్లో పొలిటికల్ టచ్ ఉన్న పాత్రలు అయినా.. లేదంటే ఏదన్నా సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ వాడినా.... అవి పెద్దగా వర్కవుట్ అయిన సందర్భాలు లేవు. గతంలో ఎన్టీఆర్ స్టూడెంట్ గా నటించిన 'నాగ' లో పూర్తి స్థాయి పాలిటిక్స్ చూపెట్టారు. అలాగే కాస్త పొలిటికల్ పంచులు పేల్చిన 'దమ్ము' 'రామయ్యావస్తావయ్యా' వంటి సినిమాలన్నీ దారుణమైన ప్లాపులు చవి చూశాయి.
ఇక నిజ జీవితంలోను ఎన్టీఆర్ తన మావయ్య చంద్ర బాబు కోసం టిడిపి తరుపున విపరీతమైన ఆకట్టుకునే ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో టిడిపి గెలవలేదు సరికదా ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట కూడా టిడిపి అస్సలు గెలవలేకపోయిన విషయం విదితమే. మరి సినిమాల్లోనూ, నిజ జీవితంలోను అచ్చిరాని పాలిటిక్స్ ని ఇప్పుడు 'జై లవ కుశ'లో ఎందుకు పెట్టారో అనే టెన్షన్ ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైంది అంటున్నారు. అయితే కేవలం ఒక్క 'జై' కేరెక్టర్ టీజర్ నే విడుదల చేసిన చిత్ర యూనిట్ మిగతా 'లవ, కుశ' కేరెక్టర్స్ టీజర్స్ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు.