ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అదరహో అనాల్సిందే

సినీ ప్రియులు, ఇటు తారక్, అటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.

Update: 2021-12-09 06:26 GMT

సినీ ప్రియులు, ఇటు తారక్, అటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది. గురువారం ఉదయం విడుదలైన ఈ ట్రైలర్.. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసే దిశగా వెళ్తోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్ లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రేక్షకుడి చేత ఈలలు వేయించే పవర్ ఫుల్ డైలాగులతో.. ట్రైలర్ చూసే ప్రతిఒక్కరిలోనూ ప్రేరణ నింపేలా ఉంది ఆర్ఆర్ఆర్ ట్రైలర్. ఇది చూసిన వారంతా అదరహో అనాల్సిందే. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ (RamCharan)‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ''భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా'' అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ హైలెట్ గా నిలిచింది.

కళ్లు చెదిరిపోయేలా....
దర్శక ధీరుడు, జక్కన్న గా పిలిచే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలిసారిగా చెర్రీ - తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అలియా భట్ సీతగా రామ్ చరణ్ సరసన, బ్రిటీష్ అమ్మాయిగా ఒలీవియా ఎన్టీఆర్ సరసన నటించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. భారీ అంచనాలతో జనవరి 7, 2022 ను ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ కుంభస్థలాన్ని బద్దలుకొడుతుందో లేదో చూడాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.


Tags:    

Similar News