తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి భావోద్వేగం
ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయలో..
tarakaratna health condition, megastar chiranjeevi
ప్రముఖ సినీనటుడు తారకరత్న ఆరోగ్యంపై సర్వతా ఆందోళన నెలకొన్న తరుణంలో.. వైద్యులు ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 27న కుప్పంలో యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన కుప్పకూలిపోయారు. కుప్పం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయలో తారకరత్న వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయితే.. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ లో ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ఆయన కోలుకుంటారన్న నమ్మకం తమకి ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తారకరత్న హెల్త్ కండీషన్ పై భావోద్వేగంతో స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. ఆయన త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తారకరత్నను ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 'డియర్ తారకరత్న నీకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి' అని చిరంజీవి ఆకాంక్షించారు.