ఎంత ఖరీదో తెలుసా?
ఒక్కొక్క కరుంగలి మాల ఖరీదు యాభై వేల రూపాయల నుంచి ఐదు వందల వరకూ ఆన్ లైన్ లో లభిస్తుంది. వివిధ సైట్ల ద్వారా అమ్మకాలు ఈ కరుంగలి మాల విషయంలో ఊపందుకున్నాయి. ఎందుకంటే ఈ మాల ధరిస్తే అంతా శుభం జరుగుతుందని, కష్టాలు తొలిగిపోతాయని పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. అందుకే అగ్ర సినీనటులు కరుంగలి మాల ధరిస్తున్నారని, మీకు కూడా కావాలంటే, ధనయోగం, మానసిక శాంతి, కుటుంబలో ఆనందం లభించాలంటే ఇప్పుడే ఈ ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని ఊదరగొట్టేస్తున్నారు. కొన్ని ఫేక్ కరుంగలి మాలలు విక్రయిస్తున్నారని, తమది ఐఎస్ఐ ముద్ర వేసిన మాల అని గొప్పలు చెప్పుకుంటూ బిజినెస్ పరంగా కొత్త టెక్నిక్ కు దిగుతున్నారు. కరుంగలి మాల తాము మురుగన్ వద్ద ఉంచి తెచ్చామని, డబ్బులు పంపితే వెంటనే మాలను మీఅడ్రస్ కు చేరవేస్తామని కూడా కొందరు చెబుతున్నారు.
మాల ధరించడం వల్ల...
కరుంగలి మాలను నల్లమల చెట్టుతో చేస్తారట. అనేక ప్రయోజనాలను కలిగి ఉందని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా, ఇది మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెబుతారు. అలాగే ఇది జీవితంలో సానుకూల శక్తిని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని విశ్వసిస్తారు. నల్ల ఎబోనీ చెక్కతో తయారు చేయబడిన మాల ఇది. దక్షిణ భారతదేశంలో ఇది ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది మరియు సాధువులు, యోగులు,ఆలయ పూజారులు దీనిని ఆచారాలు, ధ్యానం మరియు రోజువారీ ప్రార్థనల సమయంలో ధరించే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఒక్కసారిగా ఇది ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. విపరీతంగా మాలలు అమ్ముడు పోతున్నాయి. ఆధ్యాత్మికత భావాన్ని పెంచడంలో తప్పు లేదు కానీ దాని ముసుగులో వ్యాపారాలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
నియమాలివేనంటూ...
కరుంగలి మాల ధరిస్తే ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు దరి చేరవని చెబుతున్నారు. కరుంగలి మాల మురుగన్ కు వద్ద ఉంచిన తర్వాత పూజలు చేసన తర్వాత మాత్రమే విక్రయిస్తున్నామని చెబుతున్నారు. అయితే కరుంగలి మాల ధరించడానికి నియమాలు కూడా చెబుతున్నారు. అన్ని రాశులు, స్త్రీ, పురుషులు ధరించవచ్చని, నిద్రపోయేటప్పుడు మాలను ధరించకపోవడం మంచిదంటూ వ్యాపారాభివృద్ధికి మరింత సోపానాలను పేర్చుకుంటూ పోతున్నారు. మహిళలు నెలసరి సమయంలో మాలను తీసి భద్రపర్చుకోవాలని సూచిస్తున్నారు. బాధలు, సమస్యలతో అలమటించే వారు ఈ కరుంగలి మాల కోసం పిచ్చపిచ్చగా ఆర్డర్లు పెట్టేస్తున్నారట. కొన్ని సైట్లలో స్టాక్ కొద్దిగానే ఉన్నాయని, ఇప్పుడు బుక్ చేసుకోకుంటే ఇక దొరకకపోవచ్చని కూడా ప్రకటనలు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెట్ లో కరుంగలి మాల ట్రెండింగ్ లో ఉందట.