మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్.. బెంబేలేత్తుతున్న బాలీవుడ్‌..

మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపిస్తూ వస్తుంది.

Update: 2023-10-06 12:51 GMT

బాలీవుడ్ లో ప్రస్తుతం 'మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్' హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో భాగంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపిస్తూ వస్తుంది. ఈక్రమంలోనే రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోకి కూడా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపించింది. అసలు ఈ స్కామ్ గొడవ ఏంటి..? దీనికి బాలీవుడ్ స్టార్స్ కి ఉన్న సంబంధం ఏంటి..?

మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనేది ఒక ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్. ఈ యాప్ కోసం గతంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ భారీగా పారితోషకం అందుకొని యాడ్స్ ద్వారా ప్రమోషన్స్ చేశారు. ఇక్కడ వరకు అంతా ఒకే. అయితే ఇటీవల ఈ యాప్ అధినేతల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్.. తన పెళ్లిని దుబాయ్ లో ఘనంగా చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు.. టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, కృతి కర్బందా, నేహా కక్కర్, నుశ్రుత్, భారతి సింగ్.. ఇలా చాలామంది బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.
కాగా ఈ వివాహం కోసం సౌరభ్ చంద్రకర్.. దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహాదేవ్ బెట్టింగ్ యాప్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. యాప్ ముసుగులో మనీలాండరింగ్ జరుగుతుందంటూ ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ బెట్టింగ్ యాప్ పై ఈడీ దృష్టి సారించింది. ఈ ఆరోపణలు పై విచారణ చేపట్టిన ఈడీ.. ఈ యాప్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు, దీనికోసం ప్రమోట్ చేసిన స్టార్స్ కి నోటీసులు పంపిస్తూ వస్తుంది.
ఈక్రమంలోనే ఇటీవల రణబీర్ కపూర్ కి కూడా నోటీసులు వెళ్లాయి. తాజాగా ఇప్పుడు మరికొందరు బాలీవుడ్ యాక్టర్స్ కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి కూడా నోటీసులు పంపించారు. వీరితో పాటు బాలీవుడ్ లోని మరికొందరకు కూడా సమానులు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ స్కామ్ తో బాలీవుడ్ బెంబేలేత్తుతుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమందికి ఈ నోటీసులు వెళ్తాయో చూడాలి.


Tags:    

Similar News