నటుడు కైకాల మరణంపై చిరంజీవి భావోద్వేగం.. ఆయనకు ఆ వంటకమంటే చాలా ఇష్టం

శ్రీ కైకాల సత్యనారాయణతో కలిసి నేను ఎనో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని ..

Update: 2022-12-23 06:28 GMT

kaikala satyanarayana

తెలుగు సినీ పరిశ్రమ మరో విలక్షణ నటుడిని కోల్పోయింది. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిరస్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున కన్నుమూశారు. కైకాల మరణంపట్ల.. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.

కైకాల మరణంతో సినీ నటుడు చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా చేసిన యముడికి మొగుడు సినిమాలో చిరంజీవికి ధీటుగా యముడి పాత్రలో అదరహో అనిపించుకున్నారు కైకాల. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేదో గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఆయనతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ ఓ లేఖని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం నన్ను కలిచివేస్తోంది. శ్రీ కైకాల సత్యనారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు భారత సినీ రంగానికే గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతులైన నటులు. శ్రీ సత్యనారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారత దేశంలో వేరే ఏ నటుడు పోషించి ఉండరు.
శ్రీ కైకాల సత్యనారాయణతో కలిసి నేను ఎనో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేకమైన పంథా. స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను తమ్ముడూ అంటూ తోడబుట్టిన వాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకు బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకర సంఘటనలు ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యనారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటని ఆయన ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా అయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేయాడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యనారాయణ గారు సురేఖతో.. అమ్మా ఉప్పుచేప వండి పంపించు అని అన్నప్పుడు మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు.
శ్రీ కైకాల సత్యనారాయణ గారు గొప్ప సినీ సంపదని అందరికి అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేస్తున్నాను అని చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News