మారుతున్న సినిమా పరిశ్రమ లెక్కలు, మార్కెట్ స్థితిగతుల దృష్ట్యా ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా ఏడాదికి ఒక చిత్రం నిర్మించి విడుదల చేయటానికే ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 2017 లో ఏకంగా ఆరు చిత్రాలను నిర్మించటంతో పాటు మరి కొన్ని చిత్రాలని తన సమర్పణలో విడుదల చేసి ఎవరికీ సాధ్యం కాని ఘనతని సాధించారు. దిల్ రాజు 2017 లో నిర్మించిన చిత్రాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో తో చేసిన దువ్వాడ జగన్నాథం దగ్గర నుంచి పరిమిత బడ్జెట్ లో నిర్మించిన చిత్రాలు కూడా వున్నాయి. శతమానం భవతి తో మొదలుకొని నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, ఎం.సి.ఏ వరకు అన్ని సత్ఫలితాలని ఇచ్చిన చిత్రాలే ఉండటం విశేషం.
శతమానం భవతి, నేను లోకల్, ఫిదా నిర్మాతగా రాజు కి, మరో వైపు పంపిణీదారులకి, ప్రదర్శకులకి భారీ లాభాలు సమకూర్చగా, రాజా ది గ్రేట్ మరియు ఎం.సి.ఏ చిత్రాలు బ్రేక్ ఈవెన్ గా నిలిచి పంపిణీదారులని సేఫ్ చేశాయి. కాగా దిల్ రాజు 2017 లో చేసిన ఏకైక భారీ బడ్జెట్ చిత్రం దువ్వాడ జగన్నాథం భారీ అంచనాల మధ్య విడుదలై విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన పొంది కొంతమేర నష్టపోయినప్పటికీ బిజినెస్ ముగిసే నాటికి నామమాత్రపు నష్టాలతో బైట పడింది. ఇదిలా ఉండగా హీరో రవి తేజ కి కెరీర్ లో వచ్చిన ఏడాదిన్నర్ర గ్యాప్ ని బ్రేక్ చేస్తూ విజయాన్ని అందుకున్నది రాజు గారి నిర్మాణంలోనే కావటం, మరో వైపు దాదాపు ఏడు సంవత్సరాల వ్యవధి తరువాత దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఎం.సి.ఏ, మరియు దర్శకుడు సతీష్ వేగేశ్న కి శతమానం భవతి వంటి విజయవంతమైన చిత్రాలకి ప్లాట్ఫారం ఏర్పరిచి దిల్ రాజు 2017 కి గోల్డెన్ నిర్మాత గా మారిపోయారు.