మరో సంక్షోభం రాబోతోంది : డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ మరో హెచ్చరిక చేశారు. కోవిడ్ కంటే తీవ్రమైన సంక్షోభం తలెత్తే అవకాశం..

Update: 2023-05-24 04:34 GMT

WHO Chief Tedros Adhanom

2019 ఏడాది చివరిలో చైనా లో పుట్టిన కరోనా (Covid-19) ప్రపంచానికి ఎంత నష్టం చేసిందో తెలిసిందే. వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు లాక్ డౌన్లు కొనసాగాయి. సరైన వ్యాపారం లేక.. ప్రముఖ సంస్థలకు నష్టాలు వాటిల్లాయి. గతంలో కంటే ఆదాయం భారీగా తగ్గిపోవడంతో సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం పెరిగిపోతోంది. మొన్నటి వరకూ శ్రీలంక.. నేడు పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ మరో హెచ్చరిక చేశారు. కోవిడ్ కంటే తీవ్రమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రాబోయే సంక్షోభానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉండాలన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో టెడ్రోస్ తాజాగా ప్రపంచ ఆరోగ్య పరిస్థితులపై తన నివేదికను సమర్పించారు. కోవిడ్ పై అత్యవసర పరిస్థితి ఎత్తివేసినంత మాత్రాన దానిముప్పు పూర్తిగా పోయినట్టు కాదని తేల్చి చెప్పారు. ‘‘కొత్త వేరియంట్ల కారణంగా మరో సంక్షోభం, మరణాలు సంభవించే అవకాశం ఇంకా మిగిలే ఉంది. కొవిడ్ కంటే ప్రాణాంతకమైన వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది’’ అని స్పష్టం చేశారు.
కరోనా తర్వాత వివిధ రకాల వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల పరిస్థితులను తట్టుకునే విధంగా ప్రపంచ స్థాయిలో వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. మరో సంక్షోభం ఖచ్చితంగా వస్తుందని, దానిని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


Tags:    

Similar News