Israel and Iran War : ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం తీవ్రం.. పేలుళ్లతో దద్దరిల్లుతున్న నగరాలు
ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ తాజాగా ఇజ్రాయిల్ పై దాడులకు దిగింది
ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ తాజాగా ఇజ్రాయిల్ పై దాడులకు దిగింది. క్షిపణులతో విరుచుకుపడటంతో ఇజ్రాయిల్ లో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. పౌరుల నివాసాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడులను ఇజ్రాయిల్ దేశానికిచెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోలేకపోవడంతో పెద్దయెత్తున నష్టం జరిగిందని చెబుతున్నారు. ఇరాన్ జరిపినదాడుల్లో ముగ్గురు మరణించారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అయితే ఇరాన్ మాత్రం ఎఫ్ 35 జెట్ లను తాము కూల్చివేశామని చెబుతుంది.
అణుకేంద్రాలే లక్ష్యంగా...
మరొక వైపు ఇజ్రాయిల్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఖమేనీ భవనంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈసారి కూడా ఇరాన్ లోని అణుకేంద్రాల లక్ష్యంగానే ఇజ్రాయిల్ దాడులు జరిపింది. దీంతో ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగుతుండటంతో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పశ్చిమాసియా తీవ్ర సంక్షోభంలో పడుతుందని అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుంది. యుద్ధం తీవ్రం కావడంతో భారీగా నష్టంఇరు దేశాలకు జరిగే అవకాశముందని చెబుతున్నారు.
నివాసాలపై దాడులు...
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తుండగా, టెల్ అవీవ్ పై ఇరాన్ క్షిపణులతో ప్రతి దాడులకు దిగింది. ఇరాన్ వందల సంఖ్యలో క్షిపణులను ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా నివారించలేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నష్టం కూడా భారీగానే జరిగిందంటున్నారు. భారీ పేలుళ్లు జరగడంతో అనేక భవనాలు దెబ్బతినడంతో పౌరులను ఇజ్రాయిల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అమెరికా హెచ్చరికలను కూడా పట్టించుకోవడం లేదు. భారీ పేలుళ్లతో ఇరు దేశాల నగరాలు దద్దరిల్లుతున్నాయి.యుద్ధం కొనసాగే అవకాశముందని ఇరు దేశాలు హెచ్చరికలు పంపాయి.