వెనిజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షల అమలవుతున్న నేపథ్యంలో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టెన్షన్ నెలకొంది. రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేసింది. దీంతో పాటు మరొక నౌకను కూడా సీజ్ చేసింది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం సహకారం అందింది. నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సీజ్ చేయడం ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఐస్ లాండ్ సమీపంలో కోస్ట్ గార్డ్ ఆపరేషన్ లో అమెరికా ఈ చర్యలకు దిగింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళుతున్న రష్యా జెండాతో ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ నౌకను రష్యా సబ్‌మరైన్ అనుసరిస్తోందని బుధవారం ఇద్దరు అమెరికా అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు. వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల అమలులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.
ఇటీవల కాలంలో ఇదే తొలిసారి...
ఇటీవలి కాలంలో రష్యా జెండాతో ఉన్న నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ముందుగా ‘బెల్లా–1’గా పిలిచే ఈ ట్యాంకర్ కరీబియన్ ప్రాంతంలో ఆంక్షల కింద ఉన్న నౌకలపై అమెరికా ఏర్పాటు చేసిన సముద్ర ఆంక్షలను దాటింది. కోస్ట్ గార్డ్ నౌకపైకి ఎక్కేందుకు చేసిన ప్రయత్నాలను ట్యాంకర్ తిరస్కరించిందని తెలిపారు. ఈ స్వాధీనం చర్యను ముందుగా రాయిటర్స్ వెల్లడించింది. ఎక్స్ వేదికగా అమెరికా సైన్యానికి చెందిన యూరోపియన్ కమాండ్ స్పందించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ నౌకను స్వాధీనం చేసుకుందని పేర్కొంది. ఆంక్షల పరిమితిలో ఉన్న, అక్రమ వెనిజువెలా చమురుపై ఆంక్షలు ప్రపంచంలో ఎక్కడైనా పూర్తిస్థాయిలో అమల్లోనే ఉంటాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించారు.
రష్యా స్పందన ....
ఐస్ లాండ్ సమీపంలో ఈ ఆపరేషన్‌ను కోస్ట్ గార్డ్, అమెరికా సైన్యం కలిసి నిర్వహించాయని కొందరు అధికారులు చెప్పారు. ఆ సమయంలో రష్యా సైనిక నౌకలు, ఒక సబ్‌మరైన్ సహా, ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నాయని తెలిపారు. అయితే అమెరికా, రష్యా సైనిక బలగాల మధ్య ఎలాంటి ఎదురుదాడులు జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై మాస్కో నుంచి వెంటనే స్పందన రాలేదు. అయితే రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ ఆర్టీ, నౌక సమీపంలో హెలికాప్టర్ తిరుగుతున్న దృశ్యాన్ని ప్రచురించింది. కోస్ట్ గార్డ్ వ్యాఖ్యల కోసం చేసిన అభ్యర్థనకు వెంటనే స్పందించలేదని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ నౌకా నిబంధనలను తాము పాటిస్తున్నామని, అయినా సీజ్ చేయడమేంటని రష్యా ప్రశ్నిస్తుంది.