America : అమెరికా షట్ డౌన్ అయి నేటికి 35 రోజులు.. ఇంకా ఎంతకాలం?

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అయి ఈరోజుకు 35వ రోజుకు చేరింది

Update: 2025-11-05 06:11 GMT

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అయి ఈరోజుకు 35వ రోజుకు చేరింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాలంలో నమోదైన రికార్డును సమం చేసింది. ఈ స్థితి కొనసాగితే ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘకాల షట్‌డౌన్‌గా మారనుంది. ఈ వారాంతంలో ఆరు వారాలు పూర్తి కానుండగా, పరిష్కారం దిశగా పెద్దగా మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్‌ 30వ తేదీతో నిధుల ఆమోదం ముగియడంతో ఫెడరల్‌ ప్రభుత్వ పనులు నిలిచిపోయాయి. ఆర్థిక సహాయ పథకాలు స్తంభించడంతో లక్షలాది అమెరికన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు వేతనం లేకుండా...
దాదాపు 14 లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగులు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు నుంచి పార్కు వార్డెన్ల వరకు వేతనాలు లేకుండా విధుల్లో ఉన్నారు లేదా సెలవుపై వెల్లిపోయారు. కొందరు ఉద్యోగులను సెలవుపై ప్రభుత్వం పంపింది. ట్రంప్‌ ప్రభుత్వం విమానాశ్రయాల్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. సిబ్బంది కొరత, భద్రతా తనిఖీల్లో ఆలస్యం, కొంత ఎయిర్‌స్పేస్‌ మూసివేత వంటి పరిస్థితులు ఏర్పడవచ్చని రవాణాశాఖ మంత్రి షాన్‌ డఫీ ఫిలడెల్ఫియాలో తెలిపారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
విమాన సర్వీసులపై...
మరో వారం ఇలాగే కొనసాగితే విమాన సర్వీసులు రద్దవుతాయని, రాకపోకల్లో ఆలస్యం జరుగుతుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. థాంక్స్‌గివింగ్‌ సందర్భంగా దేశీయంగా 58 లక్షల మంది ప్రయాణించనున్నారని అధికారులు అంచనా వేశారు. అరవై వేలమంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, టీఎస్ఏ అధికారులు వేతనం లేకుండా పనిచేస్తున్నారు. కొందరు సిబ్బంది పనికి రాకపోవడం వల్ల చెక్‌ఇన్‌ కౌంటర్ల వద్ద రద్దీ పెరుగుతుందని వైట్‌హౌస్‌ హెచ్చరించింది. ఇదే పరిస్థితి 2019లో కూడా చోటుచేసుకోగా, అప్పుడు ట్రంప్‌ షట్‌డౌన్‌ ముగించేందుకు సిద్ధమయ్యారు. అలాగే న్యూయార్క్‌, వర్జీనియా, న్యూ జెర్సీ, కాలిఫోర్నియాల్లో జరుగుతున్న ఎన్నికలు పరిష్కారానికి ఊపునిస్తాయన్న ఆశ కొంతమంది సభ్యుల్లో కనిపిస్తోంది.
వైద్య ఖర్చులపై భారం...
ప్రధాన ఆటంకం మాత్రం హెల్త్‌కేర్‌ ఖర్చులపైనే కొనసాగుతోంది. డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీలను పొడిగించే ఒప్పందం కుదిరిన తర్వాతే నిధుల బిల్లుకు మద్దతు ఇస్తామంటున్నారు. అయితే రిపబ్లికన్లు ముందుగా ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలంటున్నారు. రెండు వర్గాల కు చెందిన వారు కఠిన వైఖరినే కొనసాగిస్తున్నప్పటికీ, కొంతమంది మోస్తరు డెమోక్రాట్లు రాజీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నలుగురు ద్విపాక్షిక సభ్యులు బీమా ఖర్చులను తగ్గించే ప్రణాళికను ప్రతిపాదించారు. డెమోక్రాట్లు ప్రజలపై పెరుగుతున్న ప్రీమియాలు రిపబ్లికన్లపై ఒత్తిడి పెంచుతాయని భావిస్తున్నారు. అయితే ట్రంప్‌ రాజీకి సిద్ధం కావడం లేదు. ప్రభుత్వాన్ని మూసివేసి ప్రజల ఒత్తిడిని ఉపయోగించుకోవడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.





Tags:    

Similar News