Morocco: భవనాలు కూలి...ఘోర ప్రమాదం.. 22 మంది మృతి
మొరాకోలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు భవనాలు కూలిపోవడంతో ఇరవై రెండు మంది మరణించారు
మొరాకోలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు భవనాలు కూలిపోవడంతో ఇరవై రెండు మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మొరాకాలోని ఫెజ్ నగరంలో జరిగిన నాలుగు అంతస్థుల భవనాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఈ నాలుగు అంతస్థుల భవనాల్లో మొత్తం ఎనిమిది కుటుంబాలు నివాసముంటున్నాయి. పురాతన భవనాలు కావడంతో కూలిపోయాయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఎనిమిది కుటుంబాలకు చెందిన దాదాపు అరవై మంది వరకూ ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు.
శిధిలాల కింద...
అయితే ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. గాయాల పాలయిన పదహారు మందిని వరకూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. శిధిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటారేమోనని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఈ భవనం ఎందుకు కూలిపోయిందన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న భవనాల్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు.
పురాతనమైన నగరాల్లో ఒకటి...
మొరాకాలోని ఫెజ్ అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి. ఎనిమిదో శతాబ్దంలోనే ఈ నగరం నిర్మాణమయిందని చెబుతారు. మొత్తం రెండు భవనాల్లో ఎనిమిది కుటుంబాలు నివాసముంటున్నాయని తెలిపారు. భవనాలు శిధిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఖాళీ చేయాలని కూడా అధికారులు ఆదేశించినా కాలయాపన చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు అప్పుడప్పుడు భూప్రకంపనలు కూడా రావడం భవనాలు కూలిపోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.