Donald Trump : ట్రంప్ బాబాయ్ హడావిడి చేసినా ప్చ్.. పాపం లాభం లేకపోయె

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం హడావిడి చేశాడు.

Update: 2025-10-10 11:55 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం హడావిడి చేశాడు. ప్రపంచంలో శాంతి దూత అవతార మెత్తినట్లు బిల్డప్ ఇచ్చాడు. భారత్ - పాకిస్తాన్ యుద్ధాన్నితానే ఆపానని చెప్పుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేవారు విని గుర్తుపెట్టుకునేలా పదే పదే చెప్పుకొచ్చాడు. ఇక రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి తాను ప్రయత్నం చేశానని చెప్పాడు. లేటెస్ట్ గా ఇజ్రాయిల్ - గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కారణం తానే అని చెప్పుకున్నాడు. తనకు దగ్గరగా ఉండే దేశాల చేసి నామినేట్ చేయించుకోవడమే కాకుండా సిఫార్సులు కూడా చేయించుకున్నాడు. బరాక్ ఒబామాకు రాగా తనకు ఎందుకు రాదని ప్రశ్నించాడు.


అందరికీ వ్యవహార శైలి తెలిసినా...

కానీ ట్రంప్ వ్యవహారశైలిని ప్రపంచమంతా చూస్తుంది. ఎన్నికల సమయం నుంచి అతను వేస్తున్న అడుగులు.. చేస్తున్న పనులు అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అనుసరిస్తున్న వైఖరిని చూసి నోబెల్ అవార్డు ప్రకటించే వారిని పక్కన పెడితే అందరికీ మండిపోయేలా వ్యవహరించాడు. అగ్రరాజ్యమన్న అహంకార పూరిత ధోరణిని ప్రదర్శించాడు. చివరకు నోబెల్ శాంతి బహుమతికి తన పేరు దక్కలేదని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి నోబెల్ శాంగి బహుమతి తనకు ఇవ్వడానికి అర్హత ఉందా? అని ఒక్క క్షణం ఆలోచించుకుని ఉన్నా, తన సన్నిహితులు అడిగినా ముందుగానే రిజల్ట్ తెలిసేది. కానీ తనకు నోబెల్ బహుమతి గ్యారంటీ అని నమ్మినట్లుంది. పాపం.. చివరకు ఆయన ఆశలు అడియాసలయ్యాయి.

వెనెజులా ప్రతిపక్ష నాయకురాలికి...

వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. దేశంలో ప్రతిపక్ష పక్షాల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆమెను నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ యోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిపాలన కోసం విభిన్న వర్గాలను ఏకం చేసిన నాయకురాలిగా ఆమెను అభివర్ణించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శాంతి బహుమతికి ఎంపికలో దీర్ఘకాల శాంతి, అంతర్జాతీయ సౌహార్దం, వాటిని బలపరిచే సంస్థల కృషికి ప్రాధాన్యం ఇస్తారు. గత సంవత్సరం ఈ బహుమతి జపాన్ అణుబాంబు బాధితుల సంఘం ‘నిహోన్ హిడాంక్యో’కు లభించింది. అణుఅస్త్రాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా నిషేధ భావనను నిలబెట్టేందుకు ఆ సంస్థ దశాబ్దాలుగా కృషి చేస్తోంది. నోబెల్ శాంతి బహుమతి మాత్రమే నార్వే రాజధాని ఒస్లోలో అందజేస్తారు.








Tags:    

Similar News