అమెరికాను తప్పుపట్టిన రష్యా.. ఇది దారుణమన్న మాస్కో

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు నౌకలో ముగ్గురు భారతీయ సిబ్బంది ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది

Update: 2026-01-09 02:19 GMT

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు నౌకలో ముగ్గురు భారతీయ సిబ్బంది ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో అమెరికా కోస్ట్ గార్డ్ ఈ నౌకను స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయ సముద్ర చట్టాలకు, నావిగేషన్ స్వేచ్ఛకు విరుద్ధమని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. మరినెరా అనే ఈ చమురు నౌకను బుధవారం అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. దీనిపై పూర్తి సమాచారం ఇప్పటికే పలుమార్లు అమెరికాకు అందించామని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.రష్యా టుడే కథనం ప్రకారం, మరినెరా నౌక సిబ్బందిలో 17 మంది ఉక్రెయిన్ పౌరులు, ఆరుగురు జార్జియా పౌరులు, ముగ్గురు భారతీయులు, ఇద్దరు రష్యా పౌరులు ఉన్నారు.

నౌకలో ఉన్న వారిని...
అంతర్జాతీయ సముద్ర యానానికి సంబంధించిన మౌలిక నిబంధనలను అమెరికా పాటించాలి. చట్టబద్ధ కార్యకలాపాల్లో ఉన్న మరినెరా నౌకపై అక్రమ చర్యలను వెంటనే నిలిపివేయాలి,” అని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.తమ దేశపు ‘ఆంక్షల చట్టాలను సాకుగా చూపుతూ నౌకను స్వాధీనం చేసుకోవడం సమంజసం కాదని రష్యా స్పష్టం చేసింది. వెనిజువెలా సహజ వనరులపై నియంత్రణ సాధించేందుకు ఇది భాగమనే అమెరికా అధికారుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. వాటిని “అత్యంత సైనికంగా, నియో-కాలనియల్ ఆలోచనలుగా” అభివర్ణించింది.నౌకలోని సిబ్బందికి మానవీయంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని అమెరికాను రష్యా కోరింది. రష్యా పౌరుల హక్కులను కాపాడుతూ, వారిని త్వరగా స్వదేశానికి పంపేలా అడ్డంకులు సృష్టించొద్దని డిమాండ్ చేసింది.
అనుమతి పొందిన...
డిసెంబర్ 24వ తేదీన అంతర్జాతీయ చట్టాలు, రష్యా నిబంధనల ప్రకారం రష్యా జెండాతో ప్రయాణించేందుకు తాత్కాలిక అనుమతి పొందిన ఈ నౌక, నార్త్ అట్లాంటిక్ అంతర్జాతీయ జలాల్లో శాంతియుతంగా ప్రయాణిస్తూ రష్యా పోర్టు వైపు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నౌక రష్యాకు చెందినదని, పౌర వినియోగంలో ఉందని సంబంధిత సమాచారం ఇప్పటికే అమెరికాకు అందించామని రష్యా స్పష్టం చేసింది. అయినప్పటికీ, అమెరికా సైనికులు పౌర నౌకపై ఎక్కి దాన్ని స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయ సముద్ర చట్టాలకు ఘోర ఉల్లంఘన అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిని అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించాలని, అమెరికా వైఖరిని ఎండగట్టాలని కోరింది.


Tags:    

Similar News