థామస్ కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్స్ కు చేరింది. నాకౌట్ దశలో మలేషియా..

Update: 2022-05-15 12:40 GMT

న్యూఢిల్లీ : థామస్ కప్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాతో తలపడిన భారత్ పురుషుల బ్యాడ్మింటన్ జట్టు.. విజేతగా నిలిచింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్స్ కు చేరింది. నాకౌట్ దశలో మలేషియా, డెన్మార్క్ జట్లను ఓడించి.. తుదిపోరులో అడుగుపెట్టింది. అలాగే ఇండోనేషియా జట్టు చైనా , జపాన్ లను ఓడించి ఫైనల్స్ లో భారత్ తో పోటీ పడి.. పరాజయాన్ని చవిచూసింది.

థామస్ కప్ విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ జట్టును పీఎం మోదీ అభినందించారు. థామ‌స్ క‌ప్ విజ‌యంతో భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టు చరిత్ర సృష్టించింద‌ని మోదీ ట్వీట్ చేశారు. థామస్ కప్ ను భారత్ గెలవడంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుందని, ఇది నిజంగా గర్వించదగిన విషయమని మోదీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని విజయాలను అందుకోవాలని మోదీ అభిలాషించారు.
మరోవైపు థామస్ కప్ విజేత అయిన భారత జట్టుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌత‌మ్ ఆదానీ, భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ, టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, హీరో వెంకటేశ్ త‌దిత‌రుల నుంచి భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.





Tags:    

Similar News