హిందువనే విశ్వాసమే నన్ను నడిపిస్తోంది: రిషి సునాక్

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరయ్యారు

Update: 2023-08-17 05:31 GMT

భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరయ్యారు. మొరారి బాపు రామ కథా కార్యక్రమానికి హాజరుకావడం గౌరవం గానూ సంతోషంగానూ భావిస్తున్నానని రిషి తెలిపారు. ఈరోజు ఇక్కడికి ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా వచ్చానని అన్నారు. తన హిందూ విశ్వాసమే తన జీవితంలోని అన్ని అంశాల్లో మార్గదర్శిగా ఉందని అన్నారు. బ్రిటన్‌ ప్రధానిగా అత్యుత్తమంగా పనిచేసే ధైర్యాన్ని హిందూ విశ్వాసమే ఇస్తోందని రిషి తెలిపారు. బ్రిటన్‌ ప్రధాని పదవి అనేది అంత సులభమైనది కాదు. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుందని అన్నారు. బాల్యం నుంచి పెద్దయ్యే వరకూ సౌథాంప్టన్‌లోని హిందూ దేవాలయంతో తనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయని రిషి సునాక్ చెప్పుకొచ్చారు.

నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూజలు చేసేవారని.. హారతులు ఇచ్చేవారన్నారు రిషి. ఆ సమయంలో నా తోబుట్టువులతో కలిసి ప్రసాదాలను పంచేవాడినని సునాక్‌ తెలిపారు. ఆధ్యాత్మిక గురువు బాపు జీవితం విలువలతో కూడుకున్నదని.. ఆయన భక్తి, నిస్వార్ధమైన సేవాతత్వ దృక్పధం అందరికీ మార్గదర్శకమని అన్నారు. బాపు గారు చెప్పిన రామాయణం, భగవద్గీత, హనుమాన్ చాలీసా స్మరించుకుంటూ ఉంటానని అన్నారు. జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, పాలన, సేవలందించడంలో శ్రీరామచంద్రుడే తనకు స్ఫూర్తి అని రిషి సునాక్‌ చెప్పారు.


Tags:    

Similar News