Plane Crash : మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు మృతి
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు.
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మధ్య మెక్సికోలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన చిన్న విమానం కుప్పకూలి కనీసం ఏడుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రియాన్ హెర్నాండెజ్ వెల్లడించారు.టోలుకా విమానాశ్రయానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతం సాన్ మాటియో అతెంకోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇది మెక్సికో సిటీకి పశ్చిమాన సుమారు 31 మైళ్లు.
ప్రమాద సమయంలో...
పసిఫిక్ తీరంలోని అకపుల్కో నుంచి ఈ ప్రైవేట్ జెట్ బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ఫుట్‌బాల్ మైదానంలో దిగేందుకు ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందిద. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని హెర్నాండెజ్ చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన గంటల తర్వాత వరకు ఏడుగురు మృతదేహాలను వెలికి తీశారు. ఫుట్‌బాల్ మైదానంలో దిగేందుకు ప్రయత్నించిన విమానం సమీపంలోని వ్యాపార భవనం పైకప్పును ఢీకొట్టింది.
భద్రతా కారణాలతో...
ఒక్కసారిగా విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సాన్ మాటియో అతెంకో మేయర్ అనా మునీస్ మిలెనియో మీడియాతో మాట్లాడుతూ, మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లోని సుమారు 130 మందిని భద్రతా కారణాల వల్ల ఖాళీ చేయించామని తెలిపారు. అయితే విమాద ప్రమాదానికిగల కారణాలపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. విమానం కూలిపోవడానికి గల కారణాలను కనుగొని నివేదిక అందించాలని కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.