ఒమిక్రాన్ లో హెచ్ఐవీ మూలాలు ! అదెలా ?

ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్‌ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Update: 2021-12-22 06:56 GMT

ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ లో హెచ్ఐవీ మూలాలున్నట్లు దక్షిణాఫ్రికా పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిందట. ఒమిక్రాన్ ఇంత అనూహ్య వేగంతో ఎలా వ్యాపిస్తోంది ? తగ్గినట్లే తగ్గి మళ్లీ కరోనా ఒమిక్రాన్ గా ఎలా రూపాంతరం చెందింది ? టీకా తీసుకున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ ఎలా కనిపిస్తోంది ? ఇలా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలెన్నో ఉన్నాయి. వాటికి సమాధానం కోసం పరిశోధనలు చేస్తుండగా ఒమిక్రాన్ లో హెచ్ఐవీ మూలాలున్నట్లు తేలింది.

హెచ్ఐవీ సోకిన మహిళ ద్వారా ఒమిక్రాన్ ?
ఐరాస దేశాల హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ సంయుక్త నియంత్రణ కార్యక్రమం 'యూఎన్‌ఎయిడ్స్‌' గతేడాది ఓ నివేదిక ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారని, ప్రపంచ హెచ్‌ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని పేర్కొంది. ఈ వైరస్‌ సోకినవారిలో 30% పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్స్‌ని తీసుకోవడమే లేదని వివరించింది. హెచ్‌ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడనివారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు ఆలవాలంగా మారుతోంది. సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని, ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్‌ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలతో పాటు.. కేమ్ బ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కెంప్‌ బృందం కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ వైరస్‌ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయని, దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చు'' అని డాక్టర్ కెంప్‌ వివరించారు. తాజాగా బయటపడిన ఈ విషయం హెచ్ఐవీ పేషెంట్లలో ఆందోళన పెంచుతోంది. కరోనా, ఒమిక్రాన్ ల పట్ల హెచ్ఐవీ పేషెంట్ల జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News