Earth Quake : ఆప్ఘనిస్థాన్ లో భారీ భూకంపం.. ఆరు వందల మందికిపైగా మృతి

ఆప్ఘనిస్థాన్ లో జరిగిన భూకంపంతో వందల సంఖ్యలో మరణించారు. ఇప్పటి వరకూ ఆరువందల మందికి పైగానే మరణించారు

Update: 2025-09-01 07:31 GMT

ఆప్ఘనిస్థాన్ లో జరిగిన భూకంపంతో వందల సంఖ్యలో మరణించారు. ఇప్పటి వరకూ ఆరువందల మందికి పైగానే మరణించారు. మరో వెయ్యి మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. భవనాలు కుప్పకూలిపోయాయి. వరసగా ఆప్ఘనిస్థాన్ లో రెండు సార్లు భూకంపం సంభవించింది. మొదటి సారి రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.0 గా నమోదయింది. రెండో సారి భూకంప తీవ్రత 4.5 తీవ్రతగా నమోదయింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

శిధిలాల కింద చిక్కుకుని...
యూఎస్ జియోలాజికల్ సర్వే అందించిన వివరాల ప్రకారం ఆప్ఘనిస్థాన్ నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. అయితే వరస భూకంపాలతో పదమూడు వందల మందికి పైగానే తీవ్ర గాయపడ్డారు. అనేక మంది భవనాల శిధిలాల వద్ద ఉన్నారన్నఅనుమానాలు ఉన్నాయి. దీంతో సహాయక చర్యలను ఆప్ఘనిస్థాన్ ప్రారంభించింది. శిధిలాల తొలగింపును యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. కునార్ ప్రావిన్స్ ఈ భూకంపం కారణంగా తీవ్రంగా ప్రభావం అయినట్లు అధికారులు తెలిపారు.
సహాయక బృందాలు, స్థానికులు...
బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వారికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. అనేక మంది గల్లంతయినట్లు వార్తలు వస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు కనిపించక అనేకమంది ఆందోళన చెందుతున్నారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో బయటపడలేకపోయారు. అంతర్జాతీయ సమాజం ఈ విపత్తుపై స్పందించాలని ఆప్ఘనిస్థాన్ పౌరులు కోరుతున్నారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించి ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News