టెక్సాస్ లో దారుణం.. 18 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను కాల్చి చంపిన కిరాతకుడు

మెక్సికో సరిహద్దులోని ఉవాల్డేలోని ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు.

Update: 2022-05-25 02:19 GMT

అమెరికా లోని టెక్సాస్ లో దారుణం చోటు చేసుకుంది. కనికరం లేకుండా చిన్న పిల్లలను కాల్చి చంపాడో రాక్షసుడు, ఎలిమెంటరీ స్కూల్ లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మెక్సికో సరిహద్దులోని ఉవాల్డేలోని ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ తెలిపారు. అనుమానితుడు ఉవాల్డే హైస్కూల్‌లో 18 ఏళ్ల విద్యార్థి అని అబాట్ చెప్పారు. పోలీసులు అతన్ని చంపేశారు.

నిందితుడిని సాల్వడోర్‌ రామోస్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు ముందు.. తన బామ్మను చంపిన తర్వాతే వాహనంలో స్కూల్‌కు చేరుకుని ఘాతుకానికి పాల్పడినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అతను ఒక తరగతి గది నుండి మరో తరగతి గదికి వెళుతున్నప్పుడు కనీసం 18 మంది పిల్లలను చంపాడు. మరణించినవారిలో ముగ్గురు పెద్దలు కూడా ఉన్నారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లోని శాండీ హుక్ ఎలిమెంటరీలో ఒక వ్యక్తి 20 మంది పిల్లలను, ఆరుగురు పెద్దలను హతమార్చిన ఘటన అమెరికా పాఠశాలలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటనలో ఇది నిలిచింది. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి అదే కౌంటీలో నివాసి, అతను అక్కడ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను ఒంటరిగా వచ్చాడు. అతను తుపాకీ- బహుశా రైఫిల్‌తో ప్రాథమిక పాఠశాలలోకి ప్రవేశించాడని గవర్నర్ చెప్పారు.
"అతను ఎవరూ ఊహించని రీతిలో కాల్చి చంపాడు" అని గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక వార్తా సమావేశంలో అన్నారు. ఉవాల్డేలో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు.. తమ పిల్లలు బ్రతికి ఉన్నారా లేదా అని ఎంతగానో టెన్షన్ పడ్డారు. తమ పిల్లలు చనిపోయారని తెలిసిన తర్వాత ఎంతగానో రోదించారు. ఈ ఘటన అనంతరం అమెరికాలోని తుపాకీ చట్టాలు, ఆయుధాల ప్రాబల్యంపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది. పది రోజుల క్రితం, న్యూయార్క్‌లోని బఫెలో, కిరాణా దుకాణంలో ఒక సాయుధుడు 10 మందిని కాల్చి చంపాడు.


Tags:    

Similar News