వరల్డ్ అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా సువర్ణధ్యాయం

ఒకనాడు ఊబకాయంతో తోటిపిల్లలతో పరిహాసానికి గురైన నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ లో సువర్ణధ్యాయాన్ని లిఖించి భారతీయ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు.

Update: 2023-08-28 11:45 GMT

వరల్డ్ అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా సువర్ణధ్యాయం

ఒకనాడు ఊబకాయంతో తోటిపిల్లలతో పరిహాసానికి గురైన నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ లో సువర్ణధ్యాయాన్ని లిఖించి భారతీయ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఈనెల 23న చంద్రయాన్ 3 విజయోత్సవాలు భారతీయుల మనస్సుల్లో ఆనందపరవశాలు నింపగా, ఇదే నెలలో నీరజ్ చోప్రా, రెండో ప్రయత్నంలో 88.17 మీటర్లో జావెలిన్- త్రో విసిరి ఒలంపిక్స్ , ప్రపంచ చాంపియన్లలో బంగారు పతకం సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు. ‘‘నీరజ్ చోప్రా అసాధారణ ప్రతిభ ప్రదర్శించి సాటిలేని వ్యక్తిగా వరల్డ్ అథ్లెటిక్స్ లో నిలిచాడని’’ ప్రధాని మోడీ ప్రశంసించారు. హంగేరీలోని బుడాఫెస్ట్ లో వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్ పోటీలు ఆగస్టు 28 తెల్లవారు జామున జరిగాయి. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం వెండి పతకం సాధించగా, చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకూబ్ వాడ్లెజ్చ్ రజత పతకం సాధించారు.

అమెరికాలోని యుజీన్‌లో జరిగిన 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కైవసం చేసుకున్నాడు. 2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అంజుబాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.

నీరజ్ చోప్రా హర్యానాలోని పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామంలో 1997 డిసెంబర్ 24న సతీష్ కుమార్ చోప్రా, సరోజ్ బాలాదేవిలకు జన్మించాడు. చంఢీఘర్ లోని డీఏవీ కాలేజ్ లో డిగ్రీ చేశాడు. చిన్నప్పుడు ఊబకాయం గురించి తోటి పిల్లలు అతడిని ఆటపట్టించగా, చోప్రా తండ్రి అతడిని ఒక వ్యాయామశాలలో చేర్పించారు. తర్వాత అతడు పానిపట్ లోని జిమ్ లో చేరాడు. అక్కడి శివాజీ స్టేడియంలో ఆడుతున్నప్పుడు కొంతమంది జావెలిన్ – త్రో క్రీడాకారులను చూసి స్వయంగా పాల్గొన్నాడు. 2010లో పానిపట్ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రాన్ని సందర్శించినపుడు ఎలాంటి శిక్షణ లేకుండా 40 మీటర్లు జావెలెన్ –త్రోను విసరడం చూసిన జావెలెన్ త్రోయర్ జైవీర్ చౌదరి అతడి మొదటి కోచ్ అయ్యాడు. 2012 అక్టోబరు27న లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో, 68.40 మీటర్ల కొత్త జాతీయ రికార్డుతో స్వర్ణం సాధించాడు.

2016 జూనియర్ ప్రపంచ పోటీలు, ఆర్మీలో చేరిక

2016 దక్షిణ ఆసియా క్రీడలలో, చోప్రా గౌహతి అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో కొత్త వ్యక్తిగత అత్యుత్తమ విజయాన్ని సాధించాడు, 83 మీటర్ల ఒలింపిక్ అర్హత మార్కుకు కాస్త తక్కువైనా, 82.23 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచాడు. అతను ఆ నెలలో ఆస్ట్రేలియన్ కోచ్ గ్యారీ కాల్వర్ట్ కింద శిక్షణ కూడా ప్రారంభించాడు. చోప్రా పోలేండ్ లోని బిడ్గాష్చ్ లో జరిగిన 2016 ఐఎఎఎఫ్ ప్రపంచ యు20 పోటీలలో 86,48 మీటర్ల త్రోతో కొత్త ప్రపంచ జూనియర్ రికార్డ్ను నెలకొల్పి బంగారు పతకం గెలిచాడు. అలా ఒక ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్ చోప్రానే, అదే సమయంలో ఇది ఒక కొత్త జాతీయ రికార్డు కూడా.

దక్షిణ ఆసియా క్రీడలలో చోప్రా ప్రదర్శన, అతని సామర్థ్యం భారత సైన్యాన్ని ఆకట్టుకుంది. అతనికి రాజ్‌పుత్ రైఫిల్స్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) గా నేరుగా నియామకాన్ని సుబేదార్ ర్యాంక్‌తో ఇచ్చింది.

సాధించిన పతకాలు

• ఒలింపిక్‌ స్వర్ణం: 2021

ఆసియాడ్‌ స్వర్ణం: 2018

• కామన్వెల్త్‌ స్వర్ణం: 2018

• ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌: 2017

• వరల్డ్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌ స్వర్ణం: 2016

• సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌ స్వర్ణం: 2016

• ఏషియన్‌ జూ.అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ రజతం: 2016

• ప్రస్తుత జాతీయ రికార్డు: 88.07 మీ., 2021

• జూనియర్‌ వరల్డ్‌ రికార్డు: 86.48 మీ., 2016

• ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌: 88.13 మీటర్లు, 2022

Tags:    

Similar News