కలవరపెడుతోన్న కొత్త వైరస్.. 9 మంది మృతి ; డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ సమావేశం

ప్రపంచాన్ని.. మరో కొత్త వైరస్ భయపెడుతోంది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో తాజాగా ఓ కొత్తవైరస్ ..

Update: 2023-02-14 07:11 GMT

కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే పూర్తి కనుమరుగవుతుందని, మళ్లీ కరోనా ముందునాటి పరిస్థితులు ఏర్పడాలని ఎదురుచూస్తున్న ప్రపంచాన్ని.. మరో కొత్త వైరస్ భయపెడుతోంది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో తాజాగా ఓ కొత్తవైరస్ బయటపడింది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 9 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.ఈ వైరస్ ను మార్ బర్గ్ గా గుర్తించారు. ఘనాలో రోజురోజుకూ మార్ బర్గ్ కేసులు పెరిగిపోతుండటంతో.. డబ్ల్యూహెచ్ఓ వైరస్ వ్యాప్తిని, ముప్పును అంచనా వేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

మార్ బర్గ్ వైరస్ ప్రాణాంతకమైనదేనని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదని వెల్లడించింది. కాగా.. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ బారిన పడి తొమ్మిది మంది చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ కు వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదొక అంటువ్యాధి అని తేల్చి చెప్పింది.
మార్ బర్గ్ వైరస్ సోకిన వారిని తాకడం, వారి రక్తంతో పాటు ఇతర శరీర ద్రవాల ద్వారా, వారు నిద్రించిన ప్రదేశంలో పడుకోవడం, వారు వాడిన దుస్తుల్ని వాడటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. అయితే.. పీల్చే గాలిద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. ఇది ఎబోలా వ్యాధిని పోలి ఉంటుందని తెలిపింది. గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి వైరస్ మనుషులకు సోకుతుందని, మరణాల శాతం 88 గా ఉంటుందని పేర్కొంది. తీవ్రమైన తలనొప్పి, అలసట, జ్వరం వంటి లక్షణాలు వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయని వెల్లడించింది.



Tags:    

Similar News