13 గంటలు ప్రయాణించి వెనుదిరిగిన విమానం.. ఎందుకంటే..

శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దుబాయ్ నుండి బయల్దేరి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో..

Update: 2023-02-01 06:27 GMT

dubai to newzealand

దుబాయ్ నుండి న్యూజిలాండ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్ విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం దుబాయ్‌లో టేకాఫ్ అయిన విమానం 13 గంటలపాటు ప్రయాణించి మళ్లీ దుబాయ్‌లోనే దిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దుబాయ్ నుండి బయల్దేరి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆక్లాండ్ విమానాశ్రయాన్ని వరదలు ముంచెత్తడంతో అధికారులు ఎయిర్ పోర్టును మూసివేశారు. సమాచారం అందుకున్న పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి.. తిరిగి దుబాయ్ లో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనపై ఆక్లాండ్ ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. ఇది అసహనానికి గురిచేసేదే అయినా ప్రయాణికుల భద్రత తమకు చాలా ముఖ్యమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈకే448 విమానం.. దుబాయ్‌లో టేకాఫ్ అయింది. దాదాపు 9 వేల మైళ్లు ప్రయాణించిన తర్వాత పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పి శనివారం అర్థరాత్రి మళ్లీ దుబాయ్ లోనే ల్యాండ్ చేశాడు. న్యూజిలాండ్‌లో కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాశ్రయం నీటితో నిండిపోయింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం నుంచి ఆక్లాండ్ విమానాశ్రయంలో తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.






Tags:    

Similar News