Donald Trump : ట్రంప్ మామ.. కామెడీ పీస్.. నెట్టింట వైరల్ అవుతున్న సెటైర్లు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను సయితం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను సయితం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదం కరెక్టే అయినా.. ప్రపంచానికి తానే మోనార్క్ అన్న రీతిలో బిల్డప్ బాబాయ్ గా మారిపోయాడు. ఇటీవల ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ట్రంప్ ఎంట్రీతో యుద్ధం ఆగిపోయిందంటూ ట్వీట్లు చేస్తుండటంతో కామెడీని తలపిస్తుందంటున్నారు. అమెరికా అగ్రరాజ్యమే కావచ్చు. కానీ దాని హద్దులు దానికి ఉన్నాయి. అంతర్జాతీయ సమస్యలను, యుద్ధాలను పరిష్కరించడానికి అనేక సంస్థలున్నాయి. యుద్ధాలను ఎవరూ కోరుకోరు. అలాగని వాటిని ఆపే శక్తి ఎవరికీ లేదు.
భారత్ - పాక్ మధ్య ....
ఆ మాటంటే ట్రంప్ కాదు గదా?...యుద్ధానికి దిగిన దేశాలు ఎవరి మాట వినరు. తమంతట తాము జరిగే నష్టాన్ని గుర్తించడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతుండటంతో దేశాలు వాటికవే దిగివస్తాయి. ఇటీవల భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహాల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయకులైన భారతీయ టూరిస్టులు మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ను షురూ చేశారు. మన దేశ బలగాలు పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. వందల సంఖ్యలో టెర్రరిస్టులు మరణించారు. అలాగే పాక్ లోని సైనిక స్థావరాలపై కూడా భారత్ దాడులకు దిగింది. అయితే చివరకు రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారకుడనని, తాను చెప్పడం వల్లనే భారత్, పాక్ లు యుద్ధానికి దిగకుండా దిగివచ్చాయని ట్రంప్ చెప్పుకున్నారు.
తాజాగా థాయ్ లాండ్ - కంబోడియా ....
ఇక తాజాగా థాయ్ లాండ్ - కంబోడియా మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య జరిగిన కాల్పులలో 33 మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో ట్రంప్ మరోసారి కామెడీ పోస్టు చేశారు.థాయ్ లాండ్ - కంబోడియా మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని ట్రూత్ సోషల్ మీడియాలో పో్స్టు చేశారు. ప్రస్తుతం స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఇరుదేశాల ప్రధానులతో తాను చర్చించిన మీదటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, యుద్ధం కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్య ఒపపందాలు దెబ్బతింటాయని హెచ్చరించానని చెప్పుకున్నారు. ట్రంప్ కామెడీ పీస్ గా మారారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.