ఆయుతుల్లా ఆలి ఖమేనీ మృతి : ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడి తర్వాత ప్రకటన
ఇరాన్ సుప్రీం నేత ఆయుతుల్లా ఆలి ఖమేనీ మరణించారు
ఇరాన్ సుప్రీం నేత ఆయుతుల్లా ఆలి ఖమేనీ మరణించారు. ఖమేనీ వయసు ఎనభై ఆరేళ్లు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన భారీ దాడి అనంతరం ఆయన మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెల్లవారుజామున వెల్లడించింది. కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సంయుక్త ఆపరేషన్‌లో ఖమేనీ హతమయ్యారని ప్రకటించారు.అధికార వార్తా సంస్థ ‘ఫార్స్’ కథనం ప్రకారం శనివారం జరిగిన దాడిలో ఆయుతుల్లా ఆలి ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు, కోడలు కూడా మృతి చెందారు. ఖమేనీ మరణాన్ని గుర్తిస్తూ ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏడు రోజుల ప్రభుత్వ సెలవులు ప్రకటించింది.
కఠిన పాలనకు...
1989లో ఆయుతుల్లా రుల్లాహ్ ఖమేనీ మరణానంతరం ఖమేనీ సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టారు. షా పాలనను గద్దె దించిన ఇస్లామిక్ విప్లవ దార్శనికతను ఆయన ప్రభుత్వ వ్యవస్థగా మలిచారు. షియా మత గురువుల వర్గాన్ని విస్తరించారు. పారామిలిటరీ బలగమైన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డును అత్యంత ప్రబలమైన శక్తిగా తీర్చిదిద్దారు. ఆర్థిక రంగాల్లోనూ గార్డ్ ప్రభావం పెరిగింది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఆంక్షలు ప్రజల్లో అసంతృప్తి రేపాయి. 2022లో తప్పనిసరి హిజాబ్ సరిగా ధరించలేదన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మహ్సా అమిని మృతి నిరసనలకు దారితీసింది. 2025 డిసెంబరులో దేశవ్యాప్తంగా భారీ ఆర్థిక నిరసనలు చెలరేగాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. భద్రతా బలగాలు కాల్పులు జరిపి వేల మందిని చంపినట్లు మానవహక్కుల వర్గాలు ఆరోపించాయి.
‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ క్షీణత
ఆయుతుల్లా ఆలి ఖమేనీ కాలంలో ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం కంటే పరోక్ష మద్దుతుతో కూడిన బలగాలపై ఆధారపడింది. లెబనాన్‌లోని హిజ్ బుల్లా , యెమెన్ హూతీలు, ఇరాక్‌లోని షియా మిలీషియాలకు మద్దతు ఇచ్చింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధాలు ముదిరాయి. 2024లో ఇజ్రాయెల్–ఇరాన్ ప్రత్యక్ష దాడులు జరిగాయి. 2025 జూన్‌లో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుదాడులు చేశాయి. ఇరాన్ ప్రతిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. 2015లో ప్రపంచ శక్తులతో కుదిరిన అణు ఒప్పందంలో భాగంగా ఇరాన్ యురేనియం శుద్ధిని తగ్గించేందుకు అంగీకరించింది. అయితే 2018లో ట్రంప్ ప్రభుత్వం ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. అనంతరం ఇరాన్ పరిమితులను ఉల్లంఘించి దాదాపు ఆయుధ స్థాయికి సమీపమైన శుద్ధి వరకు యురేనియం నిల్వలు పెంచుకుంది. అణు ఆయుధాలు ఇస్లాం వ్యతిరేకమని ఖమేనై మౌఖిక ఫత్వా జారీ చేసినప్పటికీ అణుశక్తి అభివృద్ధి హక్కును వదులుకోమని ప్రకటించారు.
వారసుడెవరు?
88 మంది సభ్యుల నిపుణుల సభ ఆయుతుల్లా ఆలి ఖమేనీ వారసుడిని ఎన్నుకోనుంది. అయితే స్పష్టమైన వారసుడు ఇప్పటివరకు లేరు. భవిష్యత్తులో ఇస్లామిక్ రిపబ్లిక్ దిశ ఏవైపు మళ్లుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విప్లవ గార్డ్ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషకుడుమెహిదీ ఖల్జీ గతంలో “సాంస్కృతికంగా ప్రభుత్వం దివాళా తీసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతం పనిచేయలేదు” అని వ్యాఖ్యానించారు.