కాబూల్, కందహార్‌లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు..130 మందికి పైగా మృతి
ఆప్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడులకు దిగింది. వైమానిక దాడులతో ప్రతీకార చర్యకు పాక్ దిగింది
ఆప్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడులకు దిగింది. వైమానిక దాడులతో ప్రతీకార చర్యకు పాక్ దిగింది. ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్’ ప్రారంభమయిందని పాక్ ప్రకటించింది. ఆఫ్ఘాన్ తాలిబాన్ సరిహద్దు దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారీ సైనిక చర్య ప్రారంభించింది. ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్ పేరుతో గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడులు చేపట్టినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్యల్లో 130 మందికిపైగా తాలిబాన్ యోధులు మృతి చెందగా, 200 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. సరిహద్దు పోస్టులపై తాలిబాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. ఆఫ్ఘాన్ తాలిబాన్ దూకుడుకు పాకిస్తాన్ సాయుధ దళాలు బలమైన ప్రతిస్పందన ఇస్తున్నాయని చెప్పారు.
తాలిబాన్ల శిబిరాలపై...
సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ వెల్లడించిన వివరాల ప్రకారం, కనీసం 133 మంది తాలిబాన్ కార్యకర్తలు మృతి చెందారు. 200 మందికిపైగా గాయపడ్డారు. కాబూల్, పక్తియా, కందహార్ ప్రాంతాల్లోనితాలిబాన్ల శిబిరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపారు. మరో మృతులు ఉండే అవకాశం ఉందన్నారు. తాలిబాన్ పాలనకు చెందిన కనీసం 27 పోస్టులు ధ్వంసమయ్యాయి. మరో తొమ్మిది పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇంకా రెండు కార్ప్స్ ప్రధాన కార్యాలయాలు, మూడు బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, రెండు గోలాల గిడ్డంగులు, ఒక లాజిస్టిక్స్ కేంద్రం, మూడు బెటాలియన్ ప్రధాన కార్యాలయాలు, రెండు సెక్టార్ కేంద్రాలు, 80కుపైగా ట్యాంకులు, గన్‌లు, సాయుధ వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.
పిరికి పందలా దాడికి దిగారని...
పాక్ ప్రభుత్వ ప్రసార సంస్థ పీటీవీ న్యూస్ తెలిపిన సమాచారం ప్రకారం, పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్, కందహార్, పక్తియాలోని తాలిబాన్ కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కాబూల్‌లో రెండు బ్రిగేడ్ కార్యాలయాలు, కందహార్‌లో ఒక కార్ప్స్, ఒక బ్రిగేడ్ కార్యాలయం ధ్వంసమయ్యాయని పేర్కొంది.ఇంటీరియర్ మంత్రి మొహ్సిన్ నక్వీ తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. “చీకట్లో పిరికిపందలా దాడి చేశారు. నిరపరాధ పౌరులను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం” అని ఆయన వ్యాఖ్యానించారు. “దేశ భద్రతపై రాజీ లేదు. దాడులకు తగిన మూల్యం చెల్లించాల్సిందే” అని హెచ్చరించారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి కూడా దేశ శాంతి, భౌగోళిక సమగ్రతపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. “మన సాయుధ దళాల ప్రతిస్పందన సమగ్రం, నిర్ణాయకం. మన శాంతిని బలహీనతగా భావిస్తే గట్టి సమాధానం తప్పదు” అని అన్నారు.
సైన్యం సిద్ధమంటూ...
ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ దేశ భద్రత, సార్వభౌమత్వ రక్షణకు ప్రజలు, సైన్యం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. “దాడి ఎక్కడి నుంచైనా వచ్చినా తగిన సమాధానం ఇస్తాం. మన దళాలకు పూర్తి శిక్షణ, సామర్థ్యం ఉంది” అని చెప్పారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో ప్రకటనలో నాటో దళాలు ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘానిస్తాన్‌లో శాంతి నెలకొంటుందని ఆశించామని అన్నారు. “అయితే తాలిబాన్ ఉగ్రవాదులను ప్రపంచం నలుమూలల నుంచి సమీకరించింది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది” అని ఆరోపించారు. పాకిస్తాన్ సాధారణ సంబంధాలు కొనసాగించేందుకు ప్రత్యక్షంగా, మిత్ర దేశాల ద్వారా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. “మా సహనం తీరిపోయింది. ఇప్పుడు పరిస్థితి బహిరంగ యుద్ధంలా మారింది” అని వ్యాఖ్యానించారు.