జెనీవాలో అణు చర్చలు.. యుద్ధ ముప్పు మళ్లీ...అమెరికా ఒత్తిడి మధ్య చర్చలకు రంగం సిద్ధం
ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు గురువారం జెనీవాలో జరగనున్నాయి
ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు గురువారం జెనీవాలో జరగనున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఈ చర్చలను చివరి దౌత్య ప్రయత్నంగా చూస్తున్నారు. ఒప్పందానికి ఒత్తిడి తీసుకురావాలని అమెరికా మధ్యప్రాచ్యానికి యుద్ధవిమానాలు, నౌకాదళాన్ని మొహరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని కట్టడి చేసే ఒప్పందం కావాలని చూస్తున్నారు. గత నెల దేశవ్యాప్తంగా నిరసనలు పెరగడంతో ఇరాన్‌లో అంతర్గత ఒత్తిడి ఉందని ఆయన భావిస్తున్నారు. అయితే ట్రంప్ ఆదేశాలపై జూన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన మూడు అణు కేంద్రాలపై దాడి జరిగిన తర్వాత కూడా యురేనియం శుద్ధిని కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా...
అమెరికా దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నీ లక్ష్యాలవుతాయని ఇరాన్ హెచ్చరించింది. దీంతో అక్కడ ఉన్న వేలాది అమెరికా సైనికులకు ముప్పు ఏర్పడుతుంది. గత ఏడాది పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌పైనా దాడి చేస్తామని ఇరాన్ పేర్కొంది. దీంతో ప్రాంతీయ యుద్ధం మళ్లీ చెలరేగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. “ఎవరికి విజయం దక్కదు. అది విధ్వంసకర యుద్ధమే అవుతుంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. జెనీవాకు బయలుదేరే ముందు బుధవారం ఈ ఇంటర్వ్యూ చిత్రీకరించారు. “అమెరికా స్థావరాలు ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. దురదృష్టవశాత్తు మొత్తం ప్రాంతం యుద్ధంలోకి లాగబడే పరిస్థితి రావచ్చు” అని ఆయన తెలిపారు.
జూన్ యుద్ధం తర్వాత మూడోసారి భేటీ...
జూన్‌లో జరిగిన యుద్ధం తర్వాత ఇది మూడో సమావేశం. అఘ్చీ మరోసారి ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ వాకాఫ్ తో చర్చలు జరపనున్నారు. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత జరిగిన పలు రౌండ్ల చర్చలు నిలిచిపోయాయి. తాజా చర్చలకు ఒమాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. అరేబియా ద్వీపకల్ప తూర్పు అంచున ఉన్న ఈ సుల్తానేట్ ఇరాన్–పడమటి దేశాల మధ్య చాలా కాలంగా మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈసారి యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. అంతేకాదు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ మిలిటెంట్ బలగాలకు ఇరాన్ మద్దతు అంశాలనూ చర్చల్లోకి తేవాలని కోరుతున్నారు. అయితే చర్చలు అణు అంశాలకే పరిమితం కావాలని ఇరాన్ చెబుతోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి Marco Rubio బుధవారం మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంలోని భాగాలను మళ్లీ పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రస్తుతం యురేనియం శుద్ధి చేయకపోయినా ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.
దౌత్యమార్గంలో...
జూన్ తర్వాత శుద్ధి చేయలేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అమెరికా బాంబులు వేసిన కేంద్రాలను ఇంటర్నేషన్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీతనిఖీ చేయకుండా అడ్డుకుంది. రెండు కేంద్రాల్లో కార్యకలాపాలు కనిపిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచించాయి. అక్కడి పదార్థాన్ని అంచనా వేసి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు. పశ్చిమ దేశాలు, ఐఏఈఏ ప్రకారం 2003 వరకూ ఇరాన్ అణు ఆయుధ కార్యక్రమం నడిపింది. జూన్ దాడికి ముందు యురేనియాన్ని 60 శాతం స్వచ్ఛత వరకూ శుద్ధి చేసింది. ఇది 90 శాతం ఆయుధ స్థాయికి తక్కువ దూరమే. అమెరికా గూఢచార సంస్థల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా ఆయుద్ధ కార్యక్రమాన్ని పునఃప్రారంభించలేదు. అయితే అవసరమైతే అణు పరికరం తయారు చేసే స్థాయికి చేరుకునే చర్యలు తీసుకుందని నివేదికల్లో పేర్కొన్నారు. తమ కార్యక్రమం శాంతియుతమేనని ఇరాన్ చెబుతున్నప్పటికీ, బాంబు దిశగా వెళ్లొచ్చని ఇటీవల అధికారులు హెచ్చరించారు. “ఇరాన్‌కు అణు ఆయుధం ఉండకూడదు. సూత్రం సాదాసీదా” అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్నస్ వైట్ హౌస్‌లో అన్నారు. సమస్యను దౌత్య మార్గంలో పరిష్కరించాలనే ఉద్దేశంతోనే చర్చలకు ప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు. “అయితే అధ్యక్షుడికి ఇతర మార్గాలూ ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
చర్చలు విఫలమైతే?
చర్చలు ఫలించకపోతే దాడి ఎప్పుడు జరుగుతుందన్న అనిశ్చితి నెలకొంది. పరిమిత స్థాయి దాడులతో ఇరాన్‌ను రాయితీలు ఇవ్వించే అవకాశం ఉందా అన్నది స్పష్టంగా లేదు. ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడమే లక్ష్యమైతే దీర్ఘకాల సైనిక చర్య తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. దాడి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత లేదు. ప్రాంతవ్యాప్తంగా కూడా అనిశ్చితి ఉంది. ఇరాన్ పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై లేదా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి చేయొచ్చు. ఈ ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లకు చేరాయి. గత చర్చల సమయంలో హోర్ముజ్ జలసంధిలో రవాణాను తాత్కాలికంగా నిలిపివేశామని ఇరాన్ తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ 5వ దళానికి చెందిన నౌకలు సముద్రంలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. దాడి ముప్పు ఉన్నప్పుడు గతంలోనూ ఇదే విధంగా నౌకలను సముద్రంలో విస్తరించి ఉంచినట్లు గుర్తించారు.