Plane Crash : బొలీవియాలో కూలిన విమానం... పదిహేను మంది మృతి
బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో శుక్రవారం డబ్బులు తరలిస్తున్న కార్గో విమానం కూలిపోయింది.
బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో శుక్రవారం డబ్బులు తరలిస్తున్న కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మృతిచెందారు. హైవేపై ఉన్న సుమారు డజను వాహనాలు దెబ్బతిన్నాయి. కరెన్సీ నోట్లు రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. అగ్నిమాపక విభాగాధిపతి పావెల్ టోవార్ మాట్లాడుతూ, మృతులు విమానంలో ఉన్నవారా లేక విమానాశ్రయం సమీప హైవేపై ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తున్న వారా అన్నది స్పష్టంగా తెలియలేదన్నారు. కొందరు గాయపడ్డారని చెప్పారు. ఈ విమానం శాంటాక్రజ్ నుంచి బయలుదేరింది
వాహనాలను ఢీకొట్టి...
ఈ కార్గో విమానం నగరమైన ఎల్ ఆల్టో లో వాహనాలను ఢీకొట్టిన తరువాత సమీపంలోని పొలంలో ఆగిందని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న చిత్రాలు చూపిస్తున్నాయి. ప్రమాదం సమయంలో విమానం ఎగురుతున్నదా లేక దిగుతున్నదా అన్న విషయంలో భిన్న సమాచారం వెలువడుతోంది. ప్రమాద స్థలంలో విమాన అవశేషాలు, ధ్వంసమైన కార్లు, మృతదేహాలు రహదారిపై కనిపించాయి. కనీసం 15 వాహనాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని టోవార్ తెలిపారు. మంటలు చెలరేగిన విమానాన్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బొలీవియా నుంచి...
ఈ విమానం బొలీవియా వైమానిక దళానికి చెందిన హెర్క్యులిస్ విమానం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బొలీవియా నుంచి ఇతర నగరాలకు కొత్త కరెన్సీ నోట్లు తరలిస్తున్నది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో నోట్లు చెల్లాచెదురుగా పడ్డాయి. సోషల్ మీడియాలో తిరుగుతున్న చిత్రాల్లో ప్రజలు నోట్లు ఏరుకునేందుకు పరుగులు తీస్తుండగా, అల్లర్ల నియంత్రణ దుస్తుల్లో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. అధికారులు తాత్కాలికంగా విమానాశ్రయం నుంచి అన్ని రాకపోకల్ని నిలిపివేశారు.