ఇజ్రాయిల్ పర్యటనతో ఇరు దేశాల మధ్య స్నేహం - భాగస్వామ్యం
ఇజ్రాయెల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది
ఇజ్రాయెల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మోదీ ప్రసంగించారు. గాజా యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ అంతర్జాతీయ స్థాయి దెబ్బతిన్న వేళ “స్నేహం, పరస్పర గౌరవం, భాగస్వామ్యం”తో ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.“అనిశ్చిత ప్రపంచంలో భారత్–ఇజ్రాయెల్ స్నేహం బలంగా నిలవాలి” అని మోదీ అన్నారు. సుమారు 30 నిమిషాల ప్రసంగం అనంతరం సభ్యులు నిలబడి చప్పట్లు కొట్టారు.
ఇరు దేశాల సంబంధాలు...
మోదీ నాయకత్వంలో భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత దగ్గరయ్యాయని ఈ స్వాగతం స్పష్టం చేసింది. చారిత్రకంగా పాలస్తీనీయులకు మద్దతుగా నిలిచిన భారత విదేశాంగ విధానంలో మార్పు చోటుచేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ 1992 వరకు ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. ఈ పర్యటనతో భద్రత, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచాలన్నది లక్ష్యమని అధికారులు తెలిపారు.విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నెతన్యాహు మోదీని ఆలింగనం చేసి స్వాగతించారు. తరువాత క్నెసెట్‌లో “నా ప్రియ మిత్రుడు నరేంద్ర” అంటూ పరిచయం చేశారు. “మీ పర్యటన మాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. మీరు ఇజ్రాయెల్‌కు గొప్ప మిత్రుడు” అని నెతన్యాహు అన్నారు.
ప్రతిపక్ష నిరసన
క్నెసెట్ సభలో నెతన్యాహు, సభాధ్యక్షుడు అమీర్ ఒహ్నా ప్రసంగాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా బయటకు వెళ్లారు. ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమిత్ ను కార్యక్రమానికి ఆహ్వానించలేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహు న్యాయ వ్యవస్థలో మార్పులు చేపట్టాలని చూస్తున్నారని, అందుకే ఈ వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. తర్వాత మోదీ ప్రసంగం సమయంలో ప్రతిపక్షం తిరిగి సభలోకి వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఈ నిరసన మీకు సంబంధించింది కాదు” అని మోదీకి చెప్పారు.
అధ్యక్షుడితో భేటీ....
గురువారం మోదీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్డోగ్ ను ను కలిశారు. అలాగే జెరూసలెంలో ఉన్న హోలోకాస్ట్ స్మారక కేంద్రం యాద్ వశెమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్థిక, భద్రత, రాజకీయ రంగాల్లో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో పురోగతిని పంచుకోవాలని భారత్ కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. “వాణిజ్యాన్ని విస్తరించాలి. పెట్టుబడులు పెంచాలి. మౌలిక సదుపాయాల్లో సంయుక్త అభివృద్ధి చేయాలి” అని అన్నారు.ఆసియాలో ఇజ్రాయెల్‌కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 3.6 బిలియన్ డాలర్లకు చేరిందని భారత వాణిజ్య శాఖ వెల్లడించింది.
తొలి ప్రధానిగా...
మోదీ 2017లో ఇజ్రాయెల్ పర్యటించిన తొలి భారత ప్రధాన మంత్రి. తదుపరి ఏడాది నెతన్యాహు భారత్ వచ్చారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి అనంతరం గాజా యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు మోదీ మద్దతు ప్రకటించారు. క్నెసెట్‌లో నెతన్యాహు ఆ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు గాజాలో కాల్పుల విరమణపై అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికకు భారత్ మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆమోదించిన ఈ ప్రణాళికలో హమాస్ పాలన ముగింపు, ఆయుధ విరమణ, పునర్నిర్మాణం వంటి అంశాలు ఉన్నాయి.అయితే పశ్చిమ తీరంపై ఇజ్రాయెల్ తాజాగా ఆమోదించిన చర్యలపై మోదీ ప్రస్తావన చేయలేదు. ఆ చర్యలను ఈ నెల ప్రారంభంలో భారత్ సహా వందకుపైగా దేశాలు ఖండించాయి.