Donald Trump : భారత్ ను బద్నాం చేయడానికి ట్రంప్ చేస్తున్నవి పిచ్చి ఆరోపణలేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తన అక్కసును మాత్రం వెళ్లగక్కుతూనే ఉన్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తన అక్కసును మాత్రం వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన భారత్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తగ్గినట్లే కనిపించినా మళ్లీ ఆయన ఏదో ఒక అంశంపై భారత్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ కోపమంతా రష్యా, చైనాలతో సఖ్యతగా భారత్ మెలగడమే. ఈ మూడు దేశాలు తమను అగ్రరాజ్యంగా గుర్తించడం లేదన్న కోపం ఆయన ప్రతి అడుగులో కనిపిస్తుంది. అందుకే భారత్ పై భారీగా విధించిన సుంకాలతో పాటు అమెరికాలో ఉద్యోగాల కోసం వస్తున్న భారతీయులపై ఆంక్షలను పెంచారు. ఫస్ట్ అమెరికన్ నినాదంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలోని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు.
డ్రగ్స్ విషయంలో...
తాజాగా డ్రగ్స్ లో భారత దేశం ప్రధాన కేంద్రంగా మారిందని ఆయన మరో అపవాదును భారత్ పై మోపారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న దేశాల జాబితాను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అధికారిక నివేదికలో మొత్తం ఇరవై మూడు దేశాల పేర్లను జాబితాలో ఉంచారు. అందులో భారత్ పేరు కూడా ఉంది. భారత్ తో పాటు చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మా వంటి దేశాలు కూడా ఉన్నాయి. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న మాదకద్రవ్యాల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ ఈ జాబితాను డొనాల్డ్ ట్రంప్ విడుదల చేయడం మరోసారి చర్చనీయాంశమైంది.
అదే కారణమా?
భారత్ పై కోపాన్ని ప్రదర్శించేందుకు అవకాశం చిక్కినప్పడల్లా డొనాల్డ్ ట్రంప్ వాడుకుంటున్నాడు. అంత కసి తనను భారత్ నిర్లక్ష్యం చేస్తుందని భావించడమే. గతంలో భారత్ - అమెరికా మధ్య సంబంధాలు బాగుండేవి. అయితే ఎప్పుడైతే అదనపు సుంకాల మోతతో ట్రంప్ భారత్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించినప్పుడు భారత్ రష్యా, చైనా లకు కొంత అనుకూలంగా మారిందని అంతర్జాతీయ విశ్లేషణలుచెబుతున్నాయి. అమెరికాలోని పలువురు సయితం ట్రంప్ చేష్టల వల్లనే మిత్రదేశమైన భారత్ దూరమయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. అయినా ట్రంప్ మాత్రం తన నిర్ణయాలను మార్చుకోవడం లేదు. ఏదో ఒక కారణంతో భారత్ పై తన అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.