Hyderabad : పండ్లు, పూల రేట్లు చూస్తే షాకవ్వాల్సిందే

శివరాత్రి వచ్చిందంటే పండ్లు, పూలకు గిరాకీ ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు

Update: 2025-02-26 04:13 GMT

శివరాత్రి వచ్చిందంటే పండ్లు, పూలకు గిరాకీ ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పండ్లు, పూలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. శివరాత్రి పండగ నాడు జాగరణ చేస్తూ భక్తులు ఉపవాసం ఉంటారు. ఫలాలు తిని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు. శివాలయాలకు వెళ్లడమే కాకుండా తమ ఇళ్లలోనూ శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందుకు పూల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ ఉన్న ధరలకు డబుల్ చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారు.

పండ్ల ధరలు అమాంతం...
శివరాత్రికి పండ్లు తిని కడుపు నింపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ప్రస్తుత సీజన్ లో ద్రాక్ష, ఆరెంజ్, యాపిల్, పుచ్చకాయలు ఎక్కువగా వస్తున్నాయి. మార్కెట్ లో వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. వంద రూపాయలకు రెండు యాపిల్స్ విక్రయిస్తున్నారు. ఇక పుచ్చకాయలు కేజీ ఇరవై నుంచి ముప్ఫయి రూపాయల వరకూ వ్యాపారులు అమ్ముతున్నారు. కమలాపండ్లు వంద రూపాయలకు ఐదు నుంచి ఆరుమాత్రమే ఇస్తున్నారు. మొన్నటి వరకూ వంద రూపాయలకు పది ఇచ్చేవారు. తెలుపు, నలుపు రంగుల్లో ఉన్న ద్రాక్ష కూడా అధిక ధరలు పలుకుతున్నాయి. కిలో వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకూ విక్రయిస్తున్నారు.
పూల ధరలకు రెక్కలు...
ఇక పూలధరలు అమాంతం పెరిగిపోయాయి. చామంతులు, గులాబీ, బంతిపూల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మొన్నటి వరకూ కిలో నూట ఇరవై రూపాయల వరకూ పలికిన ధరలు ఒక్కసారిగా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలకు చేరుకున్నాయి. శివరాత్రి పండగ రోజున ఎక్కువగా వినియోగించే పూల ధరలకు రెక్కలు రావడంతో పావు కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక అరటి పండ్లు నిన్నటి వరకూ డజను అరవై నుంచి డెబ్భయి రూపాయలకు విక్రయించేవారు. కానీ నేడు వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.


Tags:    

Similar News