Jubilee Hills Bye Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బారులు తీరిన ఓటర్లు

జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది.

Update: 2025-11-11 02:09 GMT

జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లుండగా, మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో నామమాత్రంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మొత్తం 4.30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం కేవలం 47 శాతం మాత్రమే నమోదయింది. ఉప ఎన్నిక కావడంతో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

226 సమస్యాత్మక ప్రాంతాలు...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మొత్తం 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అందుకు అవసరమైన భారీ బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలించనున్నారు. మొత్తం 139 పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో పరిస్థితినిఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నార. 407 పోలింగ్ కేంద్రాలకు 2,600 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. నిన్న రాత్రి పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిచేరుకున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 226 కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రత్యేకంగా హెల్ప్ లైన్...
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించనున్నారు. అలాగే ఫ్లయింగ్ స్వ్కాడ్ లను కూడా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 1950 నెంబరుకు డయల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక కోసం మొత్తం రెండు వేల మంది పోలీసులను నియమించారు. ఏజెంట్లను మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారు సూచించిన ఒకరికి మాత్రమే పోలింగ్ తీరును పర్యవేక్షించే అవకాశముంది. నిఘా నీడలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగుతుందని ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News