Hyderabad Metro Train : మెట్రో రైల నిర్వహణ తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమవుతుందా?

హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు

Update: 2025-09-26 04:18 GMT

హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తరచూ నష్టాల్లో ఉంటుదంని చెబుతున్న ఎల్ అండ్ టి సంస్థను మెట్రో రైలు కార్పొరేషన్ నుంచి తప్పించారు. ఎల్ అండ్ టి చైర్మన్ సుబ్రహ్మణ్యన్ తో జరిపిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలును టేకోవర్ చేయాలని నిర్ణయించింది. మెట్రో రైలు నిర్మాణం కోసం ఎల్ అండ్ టి సంస్థ తీసుకున్న పదమూడు వేల కోట్ల రూపాయల రుణం చెల్లింపు బాధ్యత తెలంగాణ ప్రభుత్వంతీసుకోనంది. మరో రెండు వేల కోట్ల రూపాయలను ఎల్ అండ్ టీకి ప్రభుత్వం ఈక్విటీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ప్రభుత్వం మెట్రో రైలును సమర్థవంతంగా నిర్వహించే అవకాశాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఎల్ అండ్ టిని తప్పించి...
గత కొద్దిరోజలుగా తమకు నష్టం వాటిల్లుతుందని, దీనిని నిర్వహించలేమని ఎల్ అండ్ టి సంస్థ తెలిపింది. టిక్కెట్ల ధరలను పెంచాలని పలుమార్లు కోరింది. అయితే ఇటీవల కొంత వరకూ టిక్కెట్ల ధరలకు అనుమతిచ్చింది. ఎల్ అండ్ టి సంస్థ చేతులో మెట్రో రైలు ఉంటే తాము అనుకున్నట్లుగా నగరంలో విస్తరణ జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. . అందుకే త్వరలోనే ఎల్ అండ్ టి సంస్థ కు హైదరాబాద్ మెట్రో రైలు బాధ్యతలను తప్పించాలని ఆయన నిర్ణయించినట్లు అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రభుత్వమే దానిని తీసుకుని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజారవాణా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండటం మంచిదే అయినా నష్టం మరింత ఎక్కువవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు ఉదహరిస్తున్నారు.
ప్రభుత్వ నిర్వహణ అయితే...
ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను చేపడితే అన్ని రకాలుగా ప్రజల నుంచి ఆలోచించాల్సి వస్తుందని, టిక్కెట్ల ధరలను పెంచడంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ ప్రజల డిమాండ్లకు తలొగ్గాల్సి ఉంటుందని, అప్పుడు నష్టం తీవ్రత మరింత ఎక్కువవుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. హైదరాబాద్ లో మెట్రో రైల్ 2017లో ప్రారంభమైంది. 29.14 కి.మీ. ఫేజ్-1 నెట్‌వర్క్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తోంది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఆ సంస్థ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. అయితే తరచూ తమకు నిర్వహణలో నష్టాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్‌లో నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా ఉంది. హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నప్పటికి ఏడాదికి ఆరు వందల కోట్ల నష్టం వస్తోందని ఆ సంస్థ చెబుతుంది. దీంతో ప్రభుత్వమే మెట్రో రైలును టేకోవర్ చేసింది.


Tags:    

Similar News