Hyderabad : మహిళలపై పెరుగుతున్న కేసులు

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోఈ ఏడాది మహిళలపై కేసులు పెరిగాయి

Update: 2025-12-22 07:59 GMT

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోఈ ఏడాది మహిళలపై కేసులు పెరిగాయి. నేరాలు నాలుగు శాతం పెరిగినట్లు పోలీస్ గణాంకాలు వెల్లడించాయి. వరకట్న హత్యలు, అపహరణ, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత ఏడాది పెరిగాయని పోలీసులు తెలిపారు.సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక ప్రెస్‌మీట్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. 2025లో మొత్తం 26,852 కేసులు నమోదయ్యాయని, వాటిలో 21,056 కేసులు పరిష్కరించామని చెప్పారు. దీంతో 78 శాతం కేసుల పరిష్కార రేటు సాధించామని తెలిపారు. గత ఏడాది 6,188 నిరోధక అరెస్టులు, 3,734 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కనిపించే పోలీసింగ్‌, వేగవంతమైన స్పందన, అనుమానితుల షీట్ల పర్యవేక్షణ, సంభావ్య నేరస్తుల అరెస్టులతో ఆస్తి నేరాలు 15 శాతం తగ్గాయని చెప్పారు. మొత్తం 4,121 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు అమలు చేసి, ‘జీరో–ఎన్‌బీడబ్ల్యూ’ కమిషనరేట్‌ హోదా సాధించినట్లు తెలిపారు.

శిక్షలు విధించడంలో...
55 మంది నిందితులపై 31 జీవిత ఖైదు శిక్షలు సాధించి, తెలంగాణలో తొలి స్థానంలో నిలిచామని చెప్పారు. 12 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షలు కూడా సాధించామని పేర్కొన్నారు.అడ్డగుడూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన సంచలన హత్య కేసులో ఒక్క కేసులోనే 17 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడినట్లు వెల్లడించారు. లోక్‌ అదాలత్‌ల ద్వారా 13,062 ఎఫ్‌ఐఆర్‌ కేసులు, 44,742 ఈ–పెట్టి కేసులు పరిష్కరించామని తెలిపారు.మహిళలపై నేరాల విషయానికి వస్తే 2025లో 516 పోక్సో, 809 లైంగిక వేధింపులు, 479 అపహరణ, అరడజను వరకట్న హత్య కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2024లో ఇవే సంఖ్యలు వరుసగా 392 పోక్సో, 561 వేధింపులు, 233 అపహరణ, మూడు వరకట్న హత్య కేసులుగా ఉన్నాయని వివరించారు. మొత్తం మీద 2025లో మహిళలపై నేరాలు నాలుగు శాతం పెరిగాయని కమిషనర్ తెలిపారు.




Tags:    

Similar News