Traffic in High Way : జాతీయ రహదారిపై పెరిగిన ట్రాఫిక్ రద్దీ.. నిలిచపోయిన వాహనాలు

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు.

Update: 2025-01-16 03:55 GMT

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. ఉదయం నుంచి హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై రద్దీ ఉంది. వాహనాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వచ్చే వైపు ఎక్కువ గేట్లు తెరిచిన టోల్ ప్లాజా సిబ్బంది వాహనాలు సులువుగా వెళ్లేందుకు, వేగంగా టోల్ ప్లాజా దాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది సంక్రాంతి పండగ నుంచివచ్చే సమయంలో ఎక్కువ రద్దీ నెలకొని అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ఏడాది పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అత్యధికంగా వాహనాలు విజయవాడ వైపు నుంచి వస్తాయని తెలుసు కాబట్టి అటువైపు నుంచి రద్దీ ఏర్పడినా వాహనాలు ఆగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు కూడా కొంత స్లోగా నడుస్తుండటంతో పోలీసులు టోల్ ప్లాజా సిబ్బందితో మాట్లాడుతున్నారు.

పండగ ముగించుకుని...
సంక్రాంతి పండగను మూడు రోజులు తమ సొంత గ్రామాల్లో చేసుకుని తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఎక్కువ మంది సొంత వాహనాలలో ఆంధ్రప్రదేశ్ లోని తమ సొంత గ్రామాలకు వెళ్లారు. ఇక తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలు చూసేందుకు ఎక్కువ మంది తరలి వెళ్లారు. దాదాపు లక్షకు పైగా వాహనాలు టోల్ గేట్లు దాటి వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. నిన్న కనుమ పండగ కావడంతో ఎక్కువ మంది నేటి ఉదయం నుంచి బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి మళ్లిస్తున్నారు.
నగరంలో రద్దీ పెరగకుండా...
నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరగకుండా అన్ని చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. కూకట్ పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారిని అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అంటే ఎల్.బి.నగర్, తార్నాక, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఆబిడ్స్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారిని మాత్రమే నగరంలోపలికి అనుమతిస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద సంక్రాంతికి వెళ్లిన వారు సుఖంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రయాణం సాగించాలని పోలీసులు కోరుతున్నారు. శని, ఆదివారాల్లో కూడా రద్దీ జాతీయ రహదారిపై ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Tags:    

Similar News