Heavy Rain Alert : హైదరాబాదీలూ.. ఈరోజు కూడా జాగ్రత్త.. బయటకు రాకపోవడమే మంచిది
హైదరాబాద్ నగరంలో నేడు కూడా కుండపోత వర్షం కురిసే అవకాశముందని వాతవారణ కేంద్రం తెలిపింది
హైదరాబాద్ నగరంలో నేడు కూడా కుండపోత వర్షం కురిసే అవకాశముందని వాతవారణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన వర్షానికే నగరం తడిసి ముద్దయింది. ఈరోజు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. శనివారం కావడంతో కొంత మేర సాఫ్ట్ వేర్ సంస్థలకు సెలవులు కావడంతో ఒకరకంగా ఇబ్బంది ఉండదు. అదే సమయంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి ఇళ్లకు చేరడంపైనే తల్లిండ్రులు భయపడిపోతున్నారు.
అల్పపీడన ప్రభావంతో...
అల్పపీడనం ప్రభావంతో పాటు రుతుపవనాలు బలంగా విస్తరించడంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.
ఈరోజు ఏపీలో...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కృష్ణా, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే పిడుగులు పడే అవకాశమున్నందున చెట్ల కింద ఉండవద్దని కూడా పశువుల కాపర్లను, రైతులను హెచ్చరించింది.