Jubilee Hills Bye Elections : మెజారిటీపై మూడు పార్టీల లెక్కలివే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలందరూ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరొకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ వేగంగా...
అయితే ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా ఇన్ ఛార్జులను నియమించింది. మంత్రులను, ఎమ్మెల్యేలను డివిజన్ ఇన్ ఛార్జులుగా నియమించి అక్కడ పోలింగ్ తమకు అనుకూలంగా మారేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. నిన్ననే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న అవకాశాన్ని కోల్పోకుండా ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. తెలుపు రంగు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలను ప్రస్తావిస్తుంది.
బీఆర్ఎస్ ఆశలన్నీ...
మరొకవైపు బీఆర్ఎస్ కూడా తమ పార్టీ తరుపున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యలను డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించింది. ఈ ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ సీటు కావడంతో ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని ఆందోళనలో బీఆర్ఎస్ నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఎంఐఎం మద్దతు ఇస్తుండటంతో ముస్లిం మైనారిటీ ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్తీల్లో పర్యటనలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తూ తమ హయాంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధితో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేతలను ప్రస్తావిస్తున్నారు.
చాపకింద నీరులా బీజేపీ...
బీజేపీ నేతలు మాత్రం చాపకింద నీరులా తమ పని తాము చేసుకు పోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో కమలం పార్టీ ఉంది. రెండు ప్రధాన పార్టీల పైన నమ్మకం లేకపోవడంతో ప్రజలు తమ పక్షాన నిలుస్తారన్న నమ్మకంతో బీజేపీ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ మద్దతును బీజేపీకి ప్రకటించింది. అలాగే టీడీపీ కూడా మద్దతు ప్రకటిస్తుందన్న ఆశాభావంతో ఉంది. టీడీపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉండటంతో చంద్రబాబు లండన్ నుంచి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. మొత్తం మీద మూడు పార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉన్న మెజారిటీ మాత్రం తక్కువగానే వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.