Hyderabad : దంచికొడుతున్న వర్షం.. హైదరాబాదీలు జాగ్రత్త

హైదరాబాద్ లో రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి

Update: 2025-07-24 02:27 GMT

హైదరాబాద్ లో రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రాత్రి మొదలయిన వర్షం దాదాపు రెండు గంటల సేపు ఏకధాటిగా కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా నాలాలు పొంగి మురికి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కూడా అదే వాతావరణం. మేఘావృతమైన వాతావరణం వీడలేదు. హైదరాబాద్ ను వర్షం ముంచెత్తిందనే చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి సన్నటి చినుకులతో ప్రారంభమయిన వర్షం రానున్న సమయంలో భారీగా కురిసే అవకాశముండటంతో అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు కూడా డుమ్మా కొట్టారు.

చలి చంపేస్తుందిగా...
హైదరాబాద్ లో చలి వాతావరణం నెలకొంది. దుప్పటి నుంచి బయటకు రావడానికి జనం భయపడిపోతున్నారు. చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు గురువారం కావడంతో విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా ఇబ్బందుల పడే అవకాశముంది. రాత్రి కురిసిన భారీ వర్షంతో అనేక రహదారుల్లో నీరు నిలిచింది. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ ఎక్కడైనా తెరిచి ఉంటాయేమోనని, జాగ్రత్తగా వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చీకట్లో, వర్షం భారీగా కురుస్తుండటంతో దాదాపు గంట సేపు ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది.
తెలంగాణ వ్యాప్తంగా...
కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు. తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లాలో అయితే భారీ వర్షం కురిసి వరద ముంచెత్తింది. వెంకటాపురంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయింది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ప్రయాణాలు అత్యవసరమైతే తప్ప మానుకోవాలని కూడా సూచిస్తున్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కరీంనగర్ లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లల పరిధిలో భారీ వర్షం పడిందని అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags:    

Similar News