Hyderabad : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాంటే ఇక నాలుగు గంటలే

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ఆమోదం తెలిపింది.

Update: 2025-11-06 05:32 GMT

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ఆమోదం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల్లో పెద్ద ఊతం లభించినట్లయింది. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లకు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రోత్సాహంగా నిలుస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రోడ్లు, భవనాల శాఖ కేంద్ర మంత్రిత్వశాఖ మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 40వ కిలోమీటర్‌ నుంచి 269వ కిలోమీటర్‌ వరకు 229 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల విస్తరణ చేపడతామని తెలిపింది. రెండు రాష్ట్రాల్లో భూసేకరణ పర్యవేక్షణకు అధికారులను నియమించింది.

రెండేళ్ల ప్రయత్నాలు...
హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న ఈ కీలక అంతర్రాష్ట్ర రహదారి అప్‌గ్రేడ్‌ కోసం రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి రోజూ ఈ రహదారిపై వాహనాల రాక ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎక్కువ భూభాగంతో విస్తరించి ఉన్న ఈ జాతీయ రహదారి విస్తరణ జరిగితే మరింత సౌలభ్యంగా మారుతుందన్న భావన ఎప్పటి నుంచో ఉంది. అంతేకాదు రెండు ప్రాంతాల మధ్య సమయం కూడా తగ్గే అవకాశముంది. ఈ విస్తరణ పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.భూసేకరణ ఇప్పటికే తెలంగాణలో ప్రారంభమైంది.
ఆర్డీవోలకు అప్పగిస్తూ...
తెలంగాణలో భూసేకరణ బాధ్యతను రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్లకు అప్పగించారు. యాదాద్రి–భువనగిరి జిల్లాలో చౌటుప్పల్‌ మండలంలోని తొమ్మిది గ్రామాలు, నల్గొండ జిల్లాలో చిట్యాల, నార్కెట్‌పల్లి మండలాల్లో ఐదేసి గ్రామాలు, కట్టంగూర్‌లో నాలుగు, నక్రేకల్‌లో రెండు, కేతేపల్లిలో నాలుగు గ్రామాల భూమి సేకరించనున్నారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలంలోని నాలుగు గ్రామాలు, చివ్వెంలాలో ఆరు, కోదాడలో నాలుగు, మునగాల మండలంలో ఐదు గ్రామాల భూమిని తీసుకోనున్నారు. మొత్తం 0,391.53 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతుంది.ఈ జాతీయ రహదారిని అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్మార్ట్‌ హైవేగా మార్చనున్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య మౌలిక సదుపాయల కల్పనకు మార్గం సుగమమవుతుంది.


Tags:    

Similar News