Hyderabad : హైదరాబాద్ లో మళ్లీ మొదలయిన వర్షం.. అవసరమైతే తప్ప బయటకు రాకండి

హైదరాబాద్ లో మరికాసేపట్లో భారీ వర్షం కురియనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం మొదలయింది.

Update: 2025-08-11 12:59 GMT

హైదరాబాద్ లో మరికాసేపట్లో భారీ వర్షం కురియనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం మొదలయింది. కుండపోత వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆఫీసులకు వెళ్లిన వారు వర్షం తగ్గిన వెంటనే బయలుదేరకుండా తగ్గిన కొద్దిసేపటి తర్వాత ఇళ్లకు బయలుదేరితే ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉంటారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి తిరిగి మేఘాలు కమ్ముకుండటంతో ఆఫీసులకు వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు సురక్షితంగా చేరుకునేందుకు వీలయిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే సొంత వాహనాలను తీసుకు రాకుండా ప్రజా రవాణా వ్యవస్థ వంటి వాటినే ఆశ్రయించడం మేలని సూచించింది.

సాయంత్రం వేళలోనే...
హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా సాయంత్రం వేళల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇళ్లలో వస్తువులన్నీ వర్షపు నీటికి తడిసిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వచ్చారు. అయితే నేడు కూడా భారీ వర్ష సూచన రావడంతోహైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
రహదారులపైకి నీళ్లు...
సోమవారం కావడంతో రహదారులపైన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయే అవకాశముంది. అదే సమయంలో రహదారులపైకి మోకాలులోతు నీళ్లు కూడా ప్రవహించే అవకాశముండటంతో విద్యుత్తు స్థంభాల వద్ద, మ్యాన్ హోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆల్వాల్, మల్కాజ్ గిరి, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, హయత్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు వర్షం మొదలు అవుతుండటంతో ప్రజలు ఐదు గంటలు దాటితే రోడ్డుపైకి వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల సూచించారు.


Tags:    

Similar News