Hyderabad : గజగజలాడిన హైదరాబాద్...భారీ వర్షంతో అతలాకుతలం
హైదరాబాద్ నగరం భారీ వర్షానికి తల్లడిల్లిపోయింది. నిన్న కొన్ని గంటల పాటు కురిసిన వర్షంతో హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి
హైదరాబాద్ నగరం భారీ వర్షానికి తల్లడిల్లిపోయింది. నిన్న కొన్ని గంటల పాటు కురిసిన వర్షంతో హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురువడంతో పైగా కాలనీ నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరాయి. నాలుగు చక్రాల వాహనాలు కూడా భారీవర్షానికి మునిగిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్ధిపేట్, నిర్మల్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షం నమోదయింది.
ఇంటికి చేరాల్సిన వాళ్లు...
ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాగులు, వంకలు పొంగాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో కురిసిన వర్షానికి జనం భయపడిపోయారు. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆఫీసులు, విద్యాసంస్థలు విడిచిపెట్టే సమయం కావడంతో ఇటు ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి చేరడానికి ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వర్షం తగ్గేవరకు వేచి ఉన్నారు. కొందరు బయటకు వచ్చి రోడ్డు మీద చిక్కుకుపోయారు. ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితిలో రహదారులపై నీరు ప్రవహించింది. అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్థంభించింది.
కుండపోత వర్షానికి...
ఇళ్లలో ఉన్న వారు కూడా కుండపోత వర్షానికి భయపడిపోయారు. వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ తెరిచి రోడ్ల మీద నీళ్లు నిలవకుండా చేయగలిగారు. పైగా కాలనీ, ప్యారడైజ్ సెంటర్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని హైడ్రా అధికారులు రంగంలోకి దిగి పడవల్లో బయటకు తీసుకు వచ్చారు. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించడంతో ఈ నాలుగు రోజులు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు కూడా వర్షపు నీరు నిలిచి ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నీరు పోయిన బురద పేరుకుపోయింది.